దీపావళి స్పెషల్ : దీపాలు ఇలా పెడితే..దరిద్రం పోయి డబ్బు వస్తుంది

  • Published By: veegamteam ,Published On : October 23, 2019 / 08:01 AM IST
దీపావళి స్పెషల్ : దీపాలు ఇలా పెడితే..దరిద్రం పోయి డబ్బు వస్తుంది

Updated On : October 23, 2019 / 8:01 AM IST

దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. చీకటి అంటే దరిద్రం (జేష్టాదేవి). వెలుగు అంటే లక్ష్మీదేవి. దీపావళి పండుగ రోజున ఇల్లంతా దీపాలు వెలిగించి ఇంట్లో ఉండే దరిద్ర దేవతను వెళ్లగొట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటం. దీపం అంటేనే లక్ష్మీదేవి. దీపాన్ని పూజిస్తే లక్ష్మీదేవిని పూజించినట్లే. అందుకే దీపావళి రోజున ఇల్లంతా దీప కాంతులతో వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. మరి ఇంటిలో ఎక్కడెక్కడ దీపం పెట్టుకోవాలో తెలుసుకుందాం..

సాధారణంగా దీపావళి పండుగకు దేవుడి గదిలో, తులసి కోట దగ్గర, ఇంటి ముంగిట, అరుగులపైన, డాబాలపైనా, బాల్కనీల్లో, ఇంటి వెనక పెరటిలో దీపాలు పెడతారు. అంతే కాకుండా ఇల్లంతా దీపాలు పెట్టాలని శాస్త్రం చెబుతోంది. ఇంటికి నాలుగు మూలలు ఉంటాయి. ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి. ఈ నాలుగు మూలాల్లోనూ దీపాలు పెట్టుకోవాలి.

అంతేకాదు ఇంటిలో స్టోర్ రూమ్ ఉన్నా దాంట్లో కూడా దీపం పెట్టాలి. ఆఖరికి బాత్రూమ్ లో కూడా దీపం పెట్టుకోవాలి. అంటే దీపావళి రోజున ఏ గదీ చీకటిగా ఉండకూడదు. చీకటి అంటే దరిద్రదేవత అని చెప్పుకున్నాం కదా. చీకటి లేకుండా ఇంటిని వెలుగుతో నింపుకోవాలి. అంటే ఇంటిలో ప్రతీ గదిలోనూ దీపాలు పెట్టాలి.

ప్రతి ద్వార బంధానికి రెండు వైపులా దీపాలు పెట్టాలి. హాల్లో, ప్రహరీ గోడలపై ఇలా ఇంటికి ప్రతీ చోటా దీపాలు వెలిగించుకోవాలి. ఇంటి గర్భంలో అంటే హాల్లో ఎక్కువ సంఖ్యలో దీపాలు వెలిగించుకోవాలి. ఇల్లంతా అంటే ఇంటిలోనే కాక ఇంటి పరిసరాలు కూడా  దీపాల వెలుగులతో నిండిపోవాలి. ఆ వెలుగులు చూసి లక్ష్మీదేవి ఇంటిలో కొలువై ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. 

దీపాలకు సంబంధించి పురాణ కథ :
ఓ మహిళ భగవంతుడ్ని ప్రార్థించింది. ప్రత్యక్షమైన దేవుడు ఏం కావాలో కోరుకోమన్నాడు. దీపావళి రోజున గ్రామంలో ఒక్క దీపం కూడా వెలగకుండా చూడమని కోరింది. దేవుడు తథాస్తు అన్నాడు. దీపావళి పండుగ వచ్చింది. ఊరిలో ఒక్క దీపం వెలగలేదు. ఆమె మాత్రం ఇల్లంతా శుభ్రం చేసుకుని దీపాల వెలుగులతో నింపివేసింది. ఆ తర్వాత ఇంటి గుమ్మంలో కూర్చుంది. దీపావళి రోజున గ్రామంలోకి వచ్చిన లక్ష్మీదేవికి ఏ ఇంటిలోను దీపం కనిపించలేదు. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఓ ఇల్లు దీప కాంతులతో వెలిగిపోతుండటం చూసి అటువైపుగా వచ్చింది.

ఈ ఇల్లాలు ఎవరో చక్కగా దీపాలు పెట్టి ఎంత బాగా అలంరించిందో కదా అంటూ ఇంటిలోకి వెళ్లబోయింది. అప్పుడా ఇల్లాలు ఆగమ్మా లక్ష్మీదేవీ.. ఇంట్లోకి వెళ్లేముందు నాకో మాట ఇవ్వు అని అడిగింది. దానికి లక్ష్మీ దేవి కోరుకోమ్మా అంది. ఇంట్లోకి వెళితే..ఇంకెప్పుడు నీవు బైటకు వెళ్లను అని మాట ఇస్తేనే వెళ్లనిస్తాను అందట. దానికి లక్ష్మీదేవి ఇల్లు ఇంత కళగా ఉంటే నేనెందుకు వెళతాను అంది. అయితే తల్లీ రామ్మా అంటూ లక్ష్మీదేవికి ఇంట్లోకి ఆహ్వానించింది.

లక్ష్మీదేవి ఇంట్లోకి రావటంతో దరిద్ర  దేవత (జేష్టాదేవి) ఇంట్లో ఉండలేకపోయింది. ఇల్లు దీపాలతో వెలిగిపోతుంటే నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను.. లక్ష్మీదేవి ఉన్నచోట నేను ఉండను అంటూ ఇంటి నుంచి వెళ్లబోయింది. అప్పుడు ఆ ఇల్లాలు దరిద్ర దేవతను ఆపి ఇక ఎప్పుడూ మా ఇంట్లోకి రానని అంటేనే వెళ్లనిస్తాను అందట. ఇల్లు దీపాలతో వెలిగిపోతుంటేనేనెలా ఉండగలను. ఇకపై ఎప్పుడూ నీ ఇంటివైపు కన్నెత్తి చూడను అంటూ వెళ్లిపోయిందట. లక్ష్మీదేవి రాక.. దరిద్ర దేవత వెళ్లటంతో ఆ ఇల్లాలు ఎంతో సంతోషించింది. దీపావళి రోజున దీపాల వెలుగులతో ఇల్లు నిండిపోతే ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఈ కథ చెబుతోంది.