Ratha Saptami: ఇవాళ రథసప్తమి.. ఆ వస్తువులను దానం చేస్తే జీవితంలో కష్టాలన్నీ పోతాయట..
రథసప్తమి సందర్భంగా తిరుమల ఆలయంకు భక్తులు పోటెత్తారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై ..

Ratha Saptami
Ratha Saptami: ప్రతి సంవత్సరం మాఘ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని ‘రథ సప్తమి’గా వ్యవహరిస్తారు. హిందూ పురాణాల ప్రకారం.. కశ్యప మహర్షి, అధితి దేవి దంపతులకు సూర్యభగవానుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజునే రథ సప్తమి. ఈ పవిత్రమైన రోజున సూర్య నారాయణుడిని పూజించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచే రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. తిరుమల, అరసవల్లిలో ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
Also Read: Aaradhya Bachchan : కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్ కూతురు.. మళ్ళీ ఆ విషయం మీదే..
రథసప్తమి వేడుకలతో తిరుమల శోభాయమానంగా మారింది. తిరుమలలోని మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై భక్తులకు స్వామివారు దర్శనమిస్తున్నారు. ప్రతీయేటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు సందర్భంగా తొమ్మిదిరోజులలో శ్రీవారు 16వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.. అయితే, రథసప్తమి పర్వదినం రోజున శ్రీవారు ఏడు వాహనాలపై మూడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించనున్నారు. ఆదిత్యుడి దర్శనం కోసం అర్ధరాత్రి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో జరుగుతున్న వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మాఘ మాసంలోని శుక్లపక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి 4న (మంగళవారం) ఉదయం 7.56గంటలకు ప్రారంభమై.. 5వ తేదీన తెల్లవారుజామున 5.29గంటలకు ముగుస్తుంది. దీంతో ఇవాళే రథసప్తమి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారు జామునుంచే భక్తులు తలంటు స్నానాలు ఆచరించి స్వామివారిని పూజిస్తున్నారు. అయితే, ఇవాళ ఎవరైనా ఒకరికి గొడుగు, చెప్పులు దానం చేస్తే మంచిదట. అలా చేయడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. అంతేకాదు.. ఈరోజు ఆదిత్య హృదయం లేదా సూర్య చాలీసా వంటివి పఠిస్తే మరింత ఫలితాన్ని పొందుతారని పురాణ వచనం.