మేడారం జాతరకు ప్రత్యేక టూరిజం ప్యాకేజీ

మేడారానికి వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ సౌకర్యాలను కల్పిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ఆయన శుక్రవారం మేడారం జాతర అభివృద్ధి పనులను పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ముందుగా తాడ్వాయిలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నిర్మించిన రిసార్ట్స్‌ను వారు ప్రారంభించారు. అనంతరం మేడారంలోని హరిత కాకతీయ హోటల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జాతరకు వస్తున్న భక్తులకు కల్పించిన వసతులు మెరుగ్గా ఉన్నాయని మంత్రులు తెలిపారు. చిలకలగుట్ట, జంపన్న వాగువద్ద గ్రామీణ నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉండడంపై, పారిశుద్ధ్యం పూర్తిగా లోపించడంపై, ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల సాకుతో పనులను నిర్లక్ష్యం చేయొద్దని, జాతర సమయం సమీపిస్తుండటంతో పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం జాతరను దేశంలోనే నంబర్ 1గా నిర్వహించేందుకు నిధులు కేటాయిస్తున్నారని వెల్లడించారు. ఫిబ్రవరి 7న సీఎం కేసీఆర్ మేడారం సందర్శించి దేవతలకు మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉందని దయాకరరావు తెలిపారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సీఎం ఆలోచనల మేరకు అధిక నిధులను కేటాయిస్తూ గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క-సారలమ్మ జాతరకు లోటులేకుండా చేస్తున్నామన్నారు. మేడారం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృధ్ది చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రూ.10 కోట్లతో 12 కాటేజీల్లో 30 గదులతో అత్యాధునిక వసతులతో తాడ్వాయిలో రిసార్ట్స్‌ను నిర్మించినట్టు చెప్పారు. మేడారం జాతర పర్యాటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కల్పిస్తోంది.
సమ్మక్క-సారలమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసి అమ్మల దర్శనంతో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. త్వరలోనే ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పారుఅనంతరం మేడారం సమ్మక్క-సారక్కలను మంత్రులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.