Statue Of Equality : భద్రపీఠికపై కొలువుదీరిన భగవద్ రామానుజులు

వేదానికి సరైన అర్ధం చెప్పి విశిష్టద్వైతం గొప్ప దనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు.

Statue Of Equality : భద్రపీఠికపై కొలువుదీరిన భగవద్ రామానుజులు

Statue of Equality

Updated On : February 1, 2022 / 11:19 AM IST

Statue Of Equality : వేదానికి సరైన అర్ధం చెప్పి విశిష్టద్వైతం గొప్ప దనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు. గతులన్నీ ఖిలమైన కలియుగమందును/గతి ఈతడే చూపె ఘన గురుదైవము’అని కీర్తించారు తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ మాటలాడే దైవమే, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రధాన ప్రచారకర్త   భగవద్రామానుజాచార్యులు.  రామానుజాచార్యుడు త్రిమతాచార్యులతో ద్వితీయుడు. కర్తవ్య దీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికి సాటిలేని భక్తికి రామానుజాచార్యుని జీవితాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

భగవద్ రామానుజులు ధార్మిక వేత్త మాత్రమే కాదు… అణగారిన వర్గాల సముధ్ధరణకు కృషి చేసిన సాంఘిక సంస్కర్త.   సమతను, మమతను, ప్రవచించిన సమతా మూర్తి.  కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహం విష్ణు రూపానిదా… శివ రూపానిదా అని శైవ, వైష్ణవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు   రామానుజాచార్యుల వారు పరిష్కారం చూపించారు.

‘సమాజంలో అసమానతలను తొలగించి సమ సమాజ స్థాపనకు విశేష కృషి చేసిన రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు (2017) పూర్తయిన సందర్భంగా ఆయన బోధనల సారాంశాన్ని,సనాతన ధర్మ విశిష్టతను తెలియచెప్పేందుకు త్రిదండి శ్రీమన్నారాయన చిన్న జియ్యర్ స్వామి వారు తలపెట్టిన కార్యక్రమమే సమతామూర్తి   విగ్రహావిష్కరణ.

రంగారెడి జిల్లా ముచ్చింతల్ లో 45 ఎకరాల విస్తీర్ణంలో  భద్రపీఠంతో సహా 216 అడుగులు ఎత్తున సుమారు వెయ్యి కోట్ల రూపాయల అంచనాతో సమతా స్ఫూర్తి కేంద్రం రూపుదిద్దుకుంది. రామానుజులు ఆశీనులైన 54 అడుగుల ఎత్తు పీఠాన్ని  భద్రవేదిక అంటారు. 27 అడుగుల ఎత్తుగల పద్మపీఠం కింద 36 ఏనుగులు, 18 జతల శంఖుచక్రాలు అమర్చారు. భద్రవేదికపై రామానుజుని విగ్రహం 108 అడుగులు కాగా, త్రిదండం ఎత్తు 135 అడుగులు. విగ్రహం చుట్టుకొలత 108 అడుగులు.

1800 కిలోల బరువుతో 216 అడుగుల ఎత్తుగల పంచలోహాలతో చైనాలో తయారైన 1600 విడిభాగాలను ఇక్కడికి తరలించి, 60 మంది నిపుణులు విగ్రహరూపం ఇచ్చారు. మహా విగ్రహం దిగువన విశాలమైన గర్భాలయంలో   బంగారంతో రూపొందించిన ఐదడుగుల మూడంగుళాల  120 కిలోల భగవద్రామానుజుల విగ్రహానికి నిత్యార్చనలు నిర్వహిస్తారు.  120 ఏళ్లు జీవించిన ఆయన   స్మృతి చిహ్నంగా అంతే సంఖ్యలోని కిలోలతో  విగ్రహాన్ని రూపొందించారు.

Also Read : Statue of Equality : భగవంతుని పొందడానికి కులము,జాతి,లింగము అడ్డుకావని చెప్పిన సమతామూర్తి శ్రీరామానుజులు

శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు   ఫిబ్రవరి 2 నుంచి 13 వ తేదీ వరకు 12 రోజుల పాటు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 2న అంకురార్పణతో ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో 3వ తేదీ అగ్నిప్రతిష్ఠ జరుగుతుంది. 5వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘సమతామూర్తి’ మహా విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు.

8వతేదీన సామూహిక ఆదిత్య జపం, 11న సామూహిక ఉపనయనాలు, 12న సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహిస్తారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 13వ తేదీన 120 కిలోల రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.  ఆ మరునాడు మహాపూర్ణాహుతి.  ఈ కార్యక్రమానికి  పలువురు కేంద్రమంత్రులు, తెలంగాణ గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు  హాజవుతారు.