TTD Sarva Darshanam : శ్రీవారి సర్వదర్శనంపై త్వరలో నిర్ణయం

శ్రీవారి సర్వదర్శనం పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

TTD Sarva Darshanam : శ్రీవారి సర్వదర్శనంపై త్వరలో నిర్ణయం

Sarva Darshanam

Updated On : August 30, 2021 / 7:09 PM IST

TTD Sarva Darshanam : శ్రీవారి సర్వదర్శనం పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న దర్శనం కోటాలో 20 నుండి 30 శాతం సర్వదర్శనం ఉండేలా నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. శ్రీవారికి జరిగే నవనీత సేవకు తిరుమల ఎస్వీ గోశాలలో సాంప్రదాయ పద్ధతిలో సేకరించిన వెన్నను ఈరోజు ఈవో కేఎస్ జవహర్ రెడ్డితో కలిసి గోశాల నుండి ఊరేగింపుగా వెన్నను తెచ్చి శ్రీవారి ఆలయానికి సమర్పించారు.

శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు నవనీత సేవతో స్వామివారికి సేవలు ప్రారంభమవుతాయి. స్వామివారి సేవకు వచ్చిన భక్తులే నవనీత సేవ కార్యక్రమంలో కూడా పాల్గొంటారని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కలియుగం ఉన్నంతకాలం, స్వామివారి అనుగ్రహం ఉన్నంతకాలం నవనీత సేవ శ్రీవారి ఆలయంలో కొనసాగుతుందని ఆయన అన్నారు.

అనంతరం తిరుమలలో పర్యావరణం పరిరక్షణ కోసం కొత్తగా కొనుగోలు చేసిన 35 ఎలక్ట్రిక్ కార్లకు పూజలు నిర్వహించి ప్రారంభించారు. తిరుమలలో పర్యావరణం, పచ్చదనాన్ని కాపాడుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టాలని రెండేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నామని…మొదటి దశలో తిరుపతి నుండి తిరుమలకు వచ్చే టీటీడీ అధికారుల కోసం 35 విద్యుత్ కార్లు కొనుగోలు చేసామని ఆయన చెప్పారు.

రెండవ దశలో తిరుమలలో భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రికల్ బస్ లు ఏర్పాటు చేస్తామని, మూడవ దశలో తిరుమలకు యాత్రికులను చేరవేయడానికి ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో 100 ఎలక్ట్రికల్ ఆర్.టి.సి బస్సులు నడపడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని… విద్యుత్ బస్సులు ఏర్పాటుకు టెండర్లను పిలవడం జరిగిందని ఆయన చెప్పారు.