Deepavali 2024: దీపావళి పండుగను అక్టోబర్ 31నే ఎందుకు జరుపుకోవాలి.. ప్రత్యేకత ఏమిటో తెలుసా?
ఈ ఏడాది అమావాస్య ఘడియలు అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో విస్తరించి ఉన్నాయి. దీంతో పండుగ జరుపుకునే తేదీపై గందరగోళం నెలకొంది.

Diwali
Deepavali Festival 2024: భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. దేశవ్యాప్తంగానేకాక తెలుగు రాష్ట్రాల్లోనూ దీపావళి పండుగను హిందువులు ఘనంగా జరుపుకుంటారు. పండుగ రోజు ప్రతి ఇంట మహిళలు ప్రత్యేకంగా లక్ష్మీపూజ నిర్వహించి తమ ఇంట సిరిసంపదలు కురిపించాలని ప్రార్థిస్తుంటారు. దీపావళి రోజున చిన్నారులు, యువత, మహిళలు ప్రతిఒక్కరూ దీపాలు వెలిగించి, టపాసులు పేల్చి ఆంనదంగా గుడుపుతారు. అయితే, దీపావళి పండుగను అక్టోబర్ 31న జరుపుకోవాలా.. నవంబర్ 1వ తేదీన జరుపుకోవాలా అనే విషయంపై ప్రజల్లో సందిగ్దత నెలకొంది. మరి పంచాంగం ప్రకారం ఏ రోజు పండుగను జరుపుకోవాలనే విషయంపై కొందరు జ్యోతిష్య పండితులు స్పష్టత ఇచ్చారు. అక్టోబర్ 31వ తేదీనే దీపావళి పండుగను జరుపుకోవాలని చెబుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.
Also Read: దీపావళి పండుగ విశిష్టత ఏంటి? ఏ రోజున జరుపుకుంటారు? లక్ష్మీపూజ ఎందుకు చేస్తారంటే..
ఈ ఏడాది అమావాస్య ఘడియలు అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో విస్తరించి ఉన్నాయి. దీంతో పండుగ జరుపుకునే తేదీపై గందరగోళం నెలకొంది. దీపావళి జరుపుకోవాలంటే ఆ రోజు సాయంత్రం అమావాస్య తిథి ఉండటం ముఖ్యం. సాయంత్రం వేళ దీపాలను వెలిగించి, టపాసులు పేల్చుతూ చీకటిని పారద్రోలి వెలుగులు మన జీవితాల్లోకి ఆహ్వానించడం ఉద్దేశం. అక్టోబర్ 31వ తేదీన నరక చతుర్దశి, దీపావళి రెండూ కలిసి ఒకేరోజు వచ్చాయని, ఉదయం పూట చతుర్దశి తిథి, మధ్యాహ్నం 3.40 నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభం అవుతుందని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 31వ తేదీ రాత్రి మొత్తం అమావాస్య వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఆ రోజున దీపావళి జరుపుకోవాలని చెబుతున్నారు.
Also Read: Dhanteras 2024: ధన త్రయోదశిని ఎందుకు జరుపుకుంటారు.. దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..
అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం నుంచి నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6.15 గంటల వరకు అమావాస్య ఘడియలు ఉంటాయి. అయితే, దీపావళికి చీకటి పడిన తరువాత అమవాస్య తిథి ఉండటం ముఖ్యం. ఈ లెక్కన అక్టోబర్ 31న (గురువారం) సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉండడంతో ఆ రోజునే ఉదయం నరక చతుర్ధశి, సాయంత్రం అమావాస్య తిథి వస్తుండటంతో అదేరోజు రాత్రి దీపావళి జరుపుకోవాలని పలువురు పండితులు సూచిస్తున్నారు.