అసలు సిసలైన మజా.. మళ్లీ ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్.. డేట్, ప్లేస్ ఫిక్స్..!
ఈ టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి. మొత్తం 20 జట్లు పాల్గొంటాయి.

IND VS PAK: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ మూడు మ్యాచుల్లో విజయ ఢంకా మోగించి టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్‌కి అసలు సిసలైన మజాను అందించింది. ఫైనల్‌లోనూ పాక్‌పై గెలిచింది. భారత్, పాకిస్థాన్ మళ్లీ టీ20లోనే తలపడనున్నాయి. 2026 మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి. మొత్తం 20 జట్లు పాల్గొంటాయి.
భారత్‌లో కనీసం ఐదు వేదికల్లో, శ్రీలంకలో రెండు వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్‌ను అహ్మదాబాద్ లేదా కొలంబోలో నిర్వహిస్తారు. ఐసీసీ షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సి ఉంది. అయితే, విశ్లేషకుల అంచనా ప్రకారం.. 2026 ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది.
అదే రోజున భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే అర్హత సాధించిన జట్లు
ప్రస్తుతం 15 జట్లు 2026 మెన్స్ టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించాయి. భారత్, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీ ఆడనున్నాయి. ఇటలీ తొలిసారి వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. మిగిలిన ఐదు స్థానాల్లో రెండు ఆఫ్రికా రీజినల్ క్వాలిఫయర్ నుంచి, మూడు ఆసియా, ఈస్ట్ ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్ నుంచి సెలెక్ట్ కావాల్సి ఉంది.
ఈ టోర్నమెంట్ ఫార్మాట్ 2024 టీ20 వరల్డ్ కప్‌లో ఉన్నట్లే ఉంటుంది. అప్పుడు 20 జట్లను ఐదేసి జట్లు ఉన్న నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపు నుంచి మొదటి రెండు జట్లు సూపర్ 8 రౌండ్‌కు చేరాయి. ఆ సూపర్ 8లో మళ్లీ నాలుగేసి జట్లతో రెండు గ్రూపులు రూపొందించారు.
ప్రతి గ్రూపు నుంచి మొదటి రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరాయి. భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ బరిలోకి దిగుతోంది. గత వరల్డ్ కప్‌లో బార్బడోస్‌లో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను భారత్ ఓడించింది. మొత్తం టోర్నమెంట్‌లో 55 మ్యాచ్‌లు జరిగాయి.