Team India : సూర్యకుమార్ యాదవ్-రాహుల్ ద్రవిడ్‌లకు కొత్త కష్టాలు..! ఇప్పుడేం చేస్తారో..!
సొంతగడ్డపై ఆస్ట్రేలియాను 4-1తో చిత్తు చేసిన భారత జట్టు దక్షిణాఫ్రికాతో పొట్టి సమరానికి సిద్ధమైంది.

Rahul Dravid-Suryakumar Yadav
సొంతగడ్డపై ఆస్ట్రేలియాను 4-1తో చిత్తు చేసిన భారత జట్టు దక్షిణాఫ్రికాతో పొట్టి సమరానికి సిద్ధమైంది. డర్బన్ వేదికగా భారత్, దక్షిణాప్రికా జట్లు మొదటి టీ20 మ్యాచులో తలపడేందుకు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, జస్ ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరంగా ఉండడంతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ఇండియాకు గట్టి సవాల్ తప్పదు.
కాంట్రాక్ట్ ను పొడిగించిన తరువాత హెడ్ కోచ్ ద్రవిడ్ మార్గనిర్దేశంలో ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. అయితే.. మొదటి టీ20 మ్యాచుకు తుది జట్టును ఎంపిక చేసే విషయంలో కోచ్ ద్రవిడ్‌కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు కష్టాలు తప్పేలా లేవు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ జట్టులోకి రావడంతో ఎవరు ఓపెనింగ్ చేస్తారు అన్న ఆసక్తి అందరిలో ఉంది.
ఓపెనర్‌గానే గిల్..
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లు వచ్చారు. ఐదు మ్యాచుల్లో రుతురాజ్ 223 పరుగులు చేశాడు. అటు జైస్వాల్ 170 స్ట్రైక్‌రేటుతో జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. ఇప్పుడు గిల్ అందుబాటులోకి రావడంతో అసలు సమస్య మొదలైంది. కాగా.. గిల్ ఖచ్చితంగా ఓపెనర్‌గా వస్తాడు అని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు.
మొదటి మ్యాచులో గిల్‌ను ఆడిస్తారని అనుకుంటున్నా. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రుతురాజ్ నిలకడగా రాణించాడు. అంతేకాదు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో వైపు జైస్వాల్ మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. వీరిద్దరలో ఒకరిని తప్పించడం అంటే కొంచెం కష్టమైన పనే. గిల్‌తో వీరిద్దరిలో ఎవరు మరో ఓపెనర్‌గా బరిలోకి దిగుతారు అనే ప్రశ్నకు అయితే తన వద్ద సమాధానం లేదన్నాడు. 17 మందిలోంచి తుది జట్టును ఎంపిక చేయడం కష్టమే అని చోప్రా అన్నాడు.
వెస్టిండీస్-యూఎస్ వేదికగా వచ్చే ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి ముందు భారత జట్టు ఆరు టీ20 మ్యాచులు మాత్రమే ఆడనుంది. ఈ క్రమంలో ప్రతీ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది.