రాయుడుకు స్వేచ్ఛ కావాలి: సీఎస్కే కోచ్

అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటేందుకు ప్రపంచ అత్యంత ధనిక దేశీవాలీ లీగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కీలకంగా వ్యవహరిస్తోంది. దేశీ.. విదేశీ ప్లేయర్ల ఆటతీరును సానబెట్టేందుకు చక్కని వేదికగా మారింది. మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడమే ప్రతి క్రికెటర్ కల. ప్రస్తుతం టీమిండియాలో నెం.4 స్థానం కోసం సెలక్షన్ కమిటీకి కనిపిస్తోన్న ఆశాకిరణం అంబటి రాయుడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ మధ్యన ఫామ్ కోల్పోయి సూపర్ కింగ్స్ జట్టులోనూ అంతగా రాణించలేకపోతున్న అంబటి రాయుడుకు సూచనలిస్తున్నాడు సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్. ‘ప్రపంచ కప్ జట్టు సెలక్షన్ గురించి రాయుడు రిలాక్స్‌డ్‌గా ఉన్నాడు. ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో ఆర్సీబీతో తలపడినప్పుడు మాత్రం ఒత్తిడితో సరిగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత మ్యాచ్ లలో అతణ్ని ఫ్రీగా వదిలేసి చూశాం. చక్కటి మార్పు కనిపించింది. ఈ ఐపీఎల్ మొత్తం అదే ఆటతీరును కనబరుస్తాడని ఆశిస్తున్నాం. ప్రపంచ కప్‌లో ఎంపిక గురించి అస్సలు ఆలోచనే లేకుండా ఆడుతుండటం మంచి విషయం’ అని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ అయిన సీఎస్కే కోచ్ తెలిపాడు.
చెన్నై సూపర్ కింగ్స్ గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఏప్రిల్ 4న జరగనున్న మ్యాచ్‌ను ముంబైలో వాంఖడే స్టేడియం వేదికగా ముంబైతో తలపడనుంది.