IND vs BAN : దుబాయ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు నేడే.. హెడ్-టు-హెడ్ రికారులు చూస్తే పరేషానే..
బుధవారం భారత్, బంగ్లాదేశ్ జట్టుతో (IND vs BAN) తలపడనుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 17 టీ20 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి.

Asia Cup 2025 today match between Team India and Bangladesh
IND vs BAN : ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా బుధవారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు దాదాపు గా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఈ క్రమంలో ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నాయి.
సూపర్-4 తొలి మ్యాచ్‌ల్లో అటు పాక్ పై భారత్ ఇటు శ్రీలంక పై బంగ్లాదేశ్ లు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసియాకప్‌లో వరుస విజయాలను సాధిస్తున్న భారత్ మరో విజయాన్ని నమోదు చేయాలని తహతహలాడుతోంది. గ్రూప్ స్టేజ్‌లో ఇబ్బంది పడిన బంగ్లాదేశ్ మాత్రం లంక పై విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది.
హెడ్-టు-హెడ్ రికార్డులు..
భారత్, బంగ్లాదేశ్ జట్లు (IND vs BAN) ఇప్పటి వరకు 17 టీ20 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో భారత్ 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒకే ఒక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలుపొందింది. అది కూడా 2019 నవంబర్‌లో జరిగిన మ్యాచ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌కు ఢిల్లీ ఆతిథ్యం ఇచ్చింది.
Sunil Gavaskar : అలా ఎలా చేస్తారు.. పాక్ పై ఐసీసీ చర్యలు తీసుకోవాల్సిందే..
ఆసియాకప్‌లో రికార్డు ఇదే..
ఆసియాకప్ టీ20 చరిత్రలో భారత్, బంగ్లాదేశ్ లు ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే ముఖాముఖిగా తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో కూడా టీమ్ఇండియానే విజయకేతనం ఎగురవేశాయి. తొలి మ్యాచ్ 2016 ఫిబ్రవరి 24న ఢాకా వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (55 బంతుల్లో 83 పరుగులు) దంచికొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది.
అదే టోర్నీలో 6 మార్చి 2016న మరోసారి భారత్, బంగ్లాదేశ్‌లు తలపడ్డాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. ఢాకా ఆతిథ్యం ఇచ్చిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 120 పరుగలు చేసింది. లక్ష్యాన్ని భారత్ 13.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది.
అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరంటే..
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. 13 మ్యాచ్‌ల్లో 36.69 సగటుతో 143.67 స్ట్రైక్‌రేటుతో 477 పరుగులు సాధించాడు. ఇందులో 5 అర్థశతకాలు ఉన్నాయి. శిఖర్ ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు. ధావన్ 10 మ్యాచ్‌ల్లో 277 పరుగులు సాధించాడు.