WTC 2027 Points Table : ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ అద్భుత విజయం.. డబ్ల్యూటీసీ 2027 పాయింట్ల పట్టికలో భారత్ కు ఏమైనా కలిసి వచ్చిందా?
ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో (WTC 2027 Points Table) ఏమైనా ప్రభావాన్ని చూపించిందా ?
ENG win Boxing Day test against australia Updated World Test Championship Points Table
WTC 2027 Points Table : యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో తొలి గెలుపును రుచి చూసింది. ఈ సిరీస్‌లో తొలి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా సొంతమైనప్పటికి కూడా నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని సాధించింది. రెండు రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్ ముగిసింది. అదే సమయంలో ఆస్ట్రేలియా గడ్డపై దాదాపు 15 ఏళ్ల తరువాత ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్‌లో గెలవడం గమనార్హం.
ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో (WTC 2027 Points Table) ఏమైనా ప్రభావాన్ని చూపించిందా ? టీమ్ఇండియాకు ఏమైనా కలిసి వచ్చిందా? అన్నది చూద్దాం.
ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో 100% పాయింట్ల శాతాన్ని కలిగి ఉంది. ఈ సైకిల్‌లో ఆసీస్‌కు ఇదే తొలి ఓటమి. దీంతో వారి పాయింట్ల శాతం 85.71కు పడిపోయింది. అయినప్పటికి కూడా పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆసీస్ ఈ సైకిల్‌లో 7 మ్యాచ్‌లు ఆడగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
కాగా.. ఈ ఓటమితో తొలి స్థానంలో ఉన్న ఆసీస్‌కు రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌కు ఉన్న పాయింట్ల శాతం అంతరం కాస్త తగ్గింది. న్యూజిలాండ్ 77.78 శాతాన్ని కలిగి ఉంది. ఆసీస్ పై విజయంతో ఇంగ్లాండ్ పాయింట్ల శాతం 35.18కి చేరింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఏడో స్థానంలో కొనసాగుతోంది.

నాలుగో టెస్టులో ఆసీస్ ఓడిపోవడం వల్ల ఎక్కువగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లకు కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ రెండు టీమ్‌లు వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఇక భారత్ విషయానికి వస్తే.. ప్రస్తుతం టీమ్ఇండియా 6వ స్థానంలో ఉంది. భారత్‌కు 48.15 పాయింట్ల శాతాన్ని కలిగి ఉంది. టీమ్ఇండియా పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచి డబ్ల్యూటీసీ 2027 ఫైనల్ కు చేరుకోవాలంటే ఇక నుంచి ఆడబోయే అన్ని సిరీస్‌ల్లో విజయాలు సాధించాల్సి ఉంటుంది.
