Hardik Pandya : ఈ సీజన్ అంతా ఇలాగే చేస్తున్నారు.. ముంబై ఇండియన్స్ ప్లేయర్లపై హార్దిక్ పాండ్యా గరం గరం..
పేలవ ఫీల్డింగ్ కారణంగానే కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఓడిపోయామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తెలిపాడు.
IPL 2026 Hardik Pandya Comments after Mumbai Indians lost match to KKR (pic credit@ipl)
- కేకేఆర్‌తో ఓటమి
- స్పందించిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా
- పేలవ ఫీల్డింగ్ వల్లే ఓడిపోయాం
Hardik Pandya : ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో ఓటమిని చవిచూసింది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్లో ముంబైకి ఇది 9వ ఓటమి కావడం గమనార్హం. కాగా.. పేలవ ఫీల్డింగ్ కారణంగానే కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఓడిపోయామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. అదే సమయంలో తాము బ్యాటింగ్‌లో ఓ 20 పరుగులు తక్కువ చేశామని, ఒకవేళ తాము ఆ పరుగులను సాధించి ఉంటే ఫలితం మరో రకంగా ఉండేదని అభిఫ్రాయపడ్డాడు.
బౌలర్లకు సహకరించిన పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కార్బిన్ బాష్ (32 నాటౌట్; 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. హార్దిక్ పాండ్యా (26), తిలక్ వర్మ (20) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దుబే, కామెరూన్ గ్రీన్, కార్తీక్ త్యాగీ లు తలా రెండు వికెట్లు తీశారు. సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం మనీశ్ పాండే (45; 33 బంతుల్లో 6 ఫోర్లు), రోవ్‌మన్ పావెల్ (40; 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 148 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ మూడు వికెట్లు తీశాడు. దీపక్ చాహర్, బుమ్రా, ఘజన్ఫర్ లు తలా ఓ వికెట్ తీశారు.
మా ఫీల్డింగ్ చాలా పేలవం
ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఓటమి నిరాశను కలిగించిందన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము ఇంకో 20 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. పవర్ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్ మూమెంటం దెబ్బతిందన్నాడు. తాను, తిలక్ వర్మ మరికొంత సమయం క్రీజులో ఉండి ఉంటే బాగుండేదన్నాడు. తమతో పాటు మరికొన్ని భాగస్వామ్యాలు నమోదై ఉంటే.. ఇంకో 15 నుంచి 20 పరుగులు వచ్చి ఉంటే మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేదన్నాడు.
పిచ్ బౌలర్లకు సహకరించిందన్నాడు. నిజం చెప్పాలంటే ఇలాంటి పిచ్ పై ఆడడం తనకు చాలా ఇష్టం అని తెలిపాడు. ఇటీవల కాలంలో ఐపీఎల్లో బ్యాటర్ల హవా కొనసాగుతోందని, బౌలర్లు నిస్సహాయంగా మారిపోతున్నారన్నాడు. ఈ మ్యాచ్‌లో పిచ్ నుంచి బౌలర్లకు కాస్త సహకారం దొరికిందని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. బ్యాటర్లకు ఈజీగా పరుగులు చేసే అవకాశం లేదని, అత్యుత్తమ షాట్లు ఆడి పరుగులు రాబట్టారని అన్నారు. ఈ వికెట్ పై ఆడడాన్ని తాను ఆస్వాదించానని తెలిపాడు.
తమ జట్టు ఫీల్డింగ్ పై మాట్లాడుతూ.. ఈ సీజన్ అంతటా తమ జట్టు ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉందని హార్దిక్ తెలిపాడు. ఇందులో దాచాల్సింది ఏమీ లేదన్నాడు. చాలా క్యాచ్‌లను వదిలివేశామన్నాడు. అయితే.. కావాలని ఎవరూ అలా చేయరని అన్నాడు. అదే సమయంలో మ్యాచ్‌లు గెలవాలంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నాడు. మ్యాచ్ గమనాన్ని మార్చే క్యాచ్‌లను వదిలివేసినప్పుడు వెనబడిపోతామన్నాడు.
ఈ సీజన్లో ముంబై జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఆదివారం సొంతమైదానం వాంఖడే వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్‌ను తాము విజయంతో ముగించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఈ మ్యాచ్‌కు ESA ఈవెంట్ కింద 25 000 మంది చిన్నారులు రానున్నారు. వారి ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావాలనేది తమ లక్ష్యం అని చెప్పాడు. వారంతా ఆటను ఆస్వాదించాలని, ఇది వారికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని హార్దిక్ పాండ్యా వ్యక్తం చేశాడు.
