Harmanpreet Kaur : చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్.. టీ20ల్లో ఏకైక కెప్టెన్..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur ) అరుదైన ఘనత సాధించింది
Harmanpreet Kaur creates history Most wins as a captain in Womens T20Is
Harmanpreet Kaur : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన ఘనత సాధించింది. మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌ల్లో విజయాన్ని అందించిన కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కింది. శుక్రవారం తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం ద్వారా హర్మన్ ఈ ఘనత అందుకుంది.
టీ20ల్లో కెప్టెన్‌గా హర్మన్‌కు ఇది 77వ విజయం. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ మెగ్ లాన్నింగ్ ను అధిగమించింది. మెగ్ లాన్నింగ్ 100 మ్యాచ్‌ల్లో ఆసీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా 76 మ్యాచ్‌ల్లో విజయాన్ని అందించింది. ఇక హర్మన్ విషయానికి వస్తే.. 130 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించగా 77 మ్యాచ్‌ల్లో గెలిపించింది.
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక విజయాలను అందించిన కెప్టెన్లు వీరే..
* హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్) – 130 మ్యాచ్‌ల్లో 77 విజయాలు
* మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) – 100 మ్యాచ్‌ల్లో 76 విజయాలు
* హీథర్ నైట్ (ఇంగ్లాండ్) – 96 మ్యాచ్‌ల్లో 72 విజయాలు
*షార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) – 93 మ్యాచ్‌ల్లో 68 విజయాలు
ఓ టీమ్ పై అత్యధిక విజయాలు..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలను అందించిన కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. శ్రీలంక పై కెప్టెన్‌గా హర్మన్‌కు ఇది 16వ విజయం.
అంతర్జాతీయ మహిళల టీ20క్రికెట్‌లో ఓ టీమ్ పై అత్యధిక విజయాలను అందించిన కెప్టెన్లు వీరే..
* హర్మన్‌ప్రీత్ కౌర్ – శ్రీలంక పై 20 మ్యాచ్‌ల్లో 16 విజయాలు
* షార్లెట్ ఎడ్వర్డ్స్ – ఆస్ట్రేలియా పై 24 మ్యాచ్‌ల్లో 14 విజయాలు
* హర్మన్‌ప్రీత్ కౌర్ – బంగ్లాదేశ్ పై 17 మ్యాచ్‌ల్లో 14 విజయాలు
* హీథర్ నైట్ – న్యూజిలాండ్ పై 15 మ్యాచ్‌ల్లో 14 విజయాలు
In a 𝗹𝗲𝗮𝗴𝘂𝗲 𝗼𝗳 𝗵𝗲𝗿 𝗼𝘄𝗻 👏#TeamIndia captain Harmanpreet Kaur creates history with a fantastic win in Trivandrum 🔝
Scorecard ▶️ https://t.co/Vkn1t7b6Dm#INDvSL | @ImHarmanpreet | @IDFCFIRSTBank pic.twitter.com/qluP4CiJzl
— BCCI Women (@BCCIWomen) December 26, 2025
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పేసర్ రేణుకా సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టింది. స్పిన్నర్ దీప్తి శర్మ మూడు వికెట్లు తీసింది. ఆ తరువాత షెఫాలి వర్మ (79 నాటౌట్ ; 42 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టడంతో 113 పరుగుల లక్ష్యాన్ని భారత్ 13.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఈ విజయంతో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది.
