Harry Brook : ఇంగ్లండ్ జట్టుకు కొత్త కెప్టెన్ హ్యారీ బ్రూక్.. వన్డే, టీ20ల్లో సారథ్య బాధ్యతలు
వారు నాపై ఉంచిన నమ్మకమే ఈ మార్పుకు కారణమైంది. వారు లేకుండా నేను ఈ స్థితిలో లేను.

Harry Brook : ఇంగ్లండ్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. హ్యారీ బ్రూక్ ని కెప్టెన్ గా నియమిస్తూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. వన్డేలు, టీ20ల్లో సారథ్య బాధ్యతలను బ్రూక్ కి అప్పగించింది ఇంగ్లండ్ కిక్రెట్ బోర్డు. ఇంగ్లండ్ కొత్త వైట్-బాల్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ నియమితుడయ్యారని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సోమవారం ధృవీకరించింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచుల్లో ఓడిపోయింది. జట్టు ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ జోస్ బట్లర్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. జోస్ బట్లర్ స్థానంలో పరిమిత ఓవర్ల కెప్టెన్ గా 26 ఏళ్ల హ్యారీ బ్రూక్ ను ఎంపిక చేసింది బోర్డు.
కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించడంపై బ్రూక్ స్పందించాడు. ఇంగ్లండ్‌కు నాయకత్వం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నాడు. 2022లో అరంగేట్రం చేసిన బ్రూక్ ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Also Read : పాపం చెన్నై జట్టు.. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కి చేరే అదృష్టం వరించాలంటే ఇలా జరగాల్సిందే.. లేదంటే..
కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 18 సీజన్‌కు హ్యారీ బ్రూక్ దూరంగా ఉన్నాడు. గత సీజన్‌లోనూ ఆడలేదు. వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో బ్రూక్‌పై రెండేళ్లపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వేలంలో అమ్ముడైన ఆటగాడు ఫిట్‌గా ఉండి కూడా ఐపీఎల్‌కు వరుసగా రెండు సీజన్లు దూరం అయితే.. ఐపీఎల్ (IPL) నిబంధనల ప్రకారం రెండేళ్ల నిషేధం పడుతుంది.
2022 జనవరిలో జట్టులోకి వచ్చాడు బ్రూక్. అప్పటి నుంచి వన్డే, టీ20 మ్యాచ్‌లలో సత్తా చాటుతున్నాడు. టెస్ట్ క్రికెట్‌లోనూ బ్రూక్ అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌కు సంబంధించి ఐసీసీ వరల్డ్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో బ్రూక్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఏడాది కాలంగా వన్డే, టీ20లలో ఇంగ్లండ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా బ్రూక్ వ్యవహరిస్తున్నాడు. గత సెప్టెంబర్‌లో బట్లర్ అందుబాటులో లేకపోవడంతో ఆస్ట్రేలియాతో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు బ్రూక్.
Also Read : ముంబై ఇండియన్స్ ఫ్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంది.. ఇలా జరిగితే చాలు..
”ఇంగ్లండ్ వైట్-బాల్ కెప్టెన్‌గా ఎంపికవడం నిజంగా గౌరవం. నేను వార్ఫెడేల్‌లోని బర్లీలో క్రికెట్ ఆడుతున్నప్పటి నుండి, యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించాలని, ఇంగ్లండ్ తరపున ఆడాలని, ఏదో ఒకరోజు జట్టుకు నాయకత్వం వహించాలని కలలు కన్నాను. ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వడం నాకు చాలా గొప్ప విషయం” అని బ్రూక్ ఒక ప్రకటనలో తెలిపాడు.
”ప్రతి అడుగులో నాకు మద్దతిచ్చిన నా కుటుంబం, కోచ్‌లకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. వారు నాపై ఉంచిన నమ్మకమే ఈ మార్పుకు కారణమైంది. వారు లేకుండా నేను ఈ స్థితిలో లేను. మరిన్ని సిరీస్‌లు, ప్రపంచ కప్‌లు, ప్రధాన ఈవెంట్‌లను గెలవడానికి కృషి చేయడానికి ఎదురు చూస్తున్నాను. నేను ముందుకు సాగడానికి నా దగ్గర ఉన్నదంతా ఇవ్వడానికి ఉత్సాహంగా ఉన్నాను” అని బ్రూక్ అన్నాడు.