Abhishek Sharma : వండర్ ఫుల్.. అభిషేక్ శర్మ మరో వెరైటీ రికార్డు.. కోహ్లీ, సూర్య, గిల్ సరసన..
విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్‌లు ఉన్న ఓ ఎలైట్ లిస్ట్‌లో అభిషేక్ శర్మ చోటు సంపాదించాడు.

IND vs ENG 5th T20 Abhishek Sharma joins Kohli Surya and Gill in special list
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పెను విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతి పడడమే ఆలస్యం బౌండరీలే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 150 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు మొత్తం చేసిన పరుగుల కంటే అభిషేక్ శర్మనే 38 పరుగులు ఆధికంగా చేయడం గమనార్హం. ఇలాంటి ఘనతను గతంలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, గిల్ ఆటగాళ్లు కలిగి ఉన్నారు. ఈ జాబితాలో తాజాగా అభిషేక్ శర్మ చేరాడు.
For playing an impressive knock of 135(54) and bagging 2 wickets, Abhishek Sharma is the Player of the Match 👌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/ifhZsbi7mr
— BCCI (@BCCI) February 2, 2025
ప్రత్యర్థి జట్టు కంటే ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు వీరే..
విరాట్ కోహ్లీ (122 నాటౌట్) – అఫ్గానిస్థాన్ (111 ఆలౌట్) – 2022లో
శుభ్‌మన్ గిల్ (126 నాటౌట్) – న్యూజిలాండ్ (66 ఆలౌట్) – 2023లో
సూర్యకుమార్ యాదవ్ (100 పరుగులు) – దక్షిణాఫ్రికా (95 ఆలౌట్) – 2023లో
అభిషేక్ శర్మ (135 పరుగులు) – ఇంగ్లాండ్ (97 ఆలౌట్) – 2025లో
2024లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు అభిషేక్ శర్మ. ఇప్పటి వరకు 17 మ్యాచులు ఆడాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 33.4 సగటు 193.8 స్ట్రైక్‌రేటుతో 535 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు రెండు అర్థశతకాలు ఉన్నాయి.
మూడు వన్డేల సిరీస్..
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ సమరం ముగిసింది. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 6న నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఫిబ్రవరి 9న కటక్ వేదికగా రెండో వన్డే, అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 12న మూడో వన్డే జరగనుంది. టీ20 సిరీస్‌లో ఎదురైన పరాభవానికి వన్డే సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. మరోవైపు భారత్ వన్డే సిరీస్‌లోనూ గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీకి మంచి ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని ఆరాటపడుతోంది.