Ind Vs Eng: పోరాడి ఓడిన భారత్.. మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం

Ind Vs Eng: ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. 193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 22 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఇంగ్లీష్ బౌలర్లు పైచేయి సాధించారు. చేతిలో 6 వికెట్లతో 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 170 పరుగులకే పరిమితమైంది.
రవీంద్ర జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓపక్క వికెట్లు పడిపోతున్నా, అంతా ఔట్ అవుతున్నా.. పోరాట పటిమ చూపించాడు. ఒంటరి పోరాటం చేశాడు. కానీ ఓటమిని తప్పించలేకపోయాడు. రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. 181 బంతులు ఎదుర్కొని 61 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.
ఇంగ్లీష్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. కార్సే 2 వికెట్లు తీశాడు. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులు చేయగా, భారత్ కూడా 387 పరుగులే చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులు చేయగా, భారత్ 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ గెలుపుతో 5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యం సాధించింది. నాలుగో టెస్ట్ మ్యాచ్ జూలై 23 నుంచి ప్రారంభం కానుంది.