వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ : ధావన్ స్థానంలో శాంసన్

  • Published By: sreehari ,Published On : November 27, 2019 / 10:58 AM IST
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ : ధావన్ స్థానంలో శాంసన్

Updated On : November 27, 2019 / 10:58 AM IST

టీమిండియా జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు చోటు దక్కింది. భారత ఓపెనర్ బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ కు మోకాలి గాయం కారణంగా టీ 20 సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో వెస్టిండీస్ తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ టీ20 సిరీస్ లో ధావన్ స్థానంలో శాంసన్‌‌ ఎంపిక అయ్యాడు. ఈ మేరకు బుధవారం (నవంబర్ 27, 2019) బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.

మహారాష్ట్రతో జరిగిన సయిద్ మస్తక్ అలీ ట్రోపీలో ధావన్ ఎడమ మోకాలికి గాయమైనట్టు బీసీసీఐ పేర్కొంది. ధావన్ మరింత కాలం విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ వైద్య బృందం సూచించింది. మోకాలి పెద్దగాయం పూర్తిగా మానేంతవరకు ఆటకు దూరంగా ఉండాలని సూచించింది. దీంతో టీ20 సిరీస్ కు ధావన్ దూరం కాక తప్పలేదు.

అతడు లేని లోటును భర్తీ చేసేందుకు సంజును జట్టులోకి దింపుతోంది బీసీసీఐ. బంగ్లాదేశ్ తో జరిగిన అంతర్జాతీయ భారత టీ20 జట్టు తరపున శాంసన్ ఆడాడు. ఈ సిరీస్ లో టీమిండియా 2-1తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ ల్లో పక్కన పెట్టేయడంతో ఒక మ్యాచ్ కూడా శాంసన్ ఆడలేదు. 

గాయం నుంచి కోలుకుంటున్న ధావన్.. డిసెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కు జట్టులోకి రానున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ ల్లో ధావన్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అతడు ఆడిన మ్యాచ్ ల్లో వరుసగా 41, 31,19 పరుగులకే పరిమితమయ్యాడు. 

టీ20 భారత జట్టు ఇదే :
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, కుల్ దీప్ యాదవ్, దీపక్ చాహర్, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, సంజు శాంసన్ (వికెట్ కీపర్).