నిర్ణయాత్మక వన్డే: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీసేన

నిర్ణయాత్మక వన్డే: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీసేన

ఆస్ట్రేలియా పర్యటనలో ఆఖరి ఫార్మాట్ అయిన వన్డే సిరీస్‌లో తలపడేందుకు కోహ్లీసేన సిద్ధమైంది. ఈ మేర టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం పడటంతో టాస్ వేసేందుకు కాస్తంత ఆలస్యమైంది. ఇప్పటికే సిరీస్‌ను 1-1తో సమంగా ఉండటంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. 

టెస్టు సిరీస్ విజయానంతరం మరో రికార్డు కొల్లగొట్టేందుకు టీమిండియా భారత్ సిద్ధమైంది. ఆసీస్ గడ్డపై ఆతిథ్య జట్టును కట్టడి చేసి వన్డే సిరీస్‌నూ సాధించాలని కలలుకంటోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో కీలకమైన మూడో వన్డేను శుక్రవారం ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్‌సేన గెలిస్తే.. ఆసీస్‌లో ద్వైపాక్షిక సిరీస్ గెలిచిన తొలి భారత జట్టుగా మరో రికార్డును సొంతం చేసుకుంటుంది. దీంతో ఏ ఫార్మాట్‌నూ ఓడిపోకుండా ఒకే పర్యటనలో రెండు అపురూపమైన, అద్వితీయమైన రికార్డులను చేజిక్కించుకొనే అవకాశం కోహ్లీసేన  ముంగిట నిలిచింది. 

ఆసీస్ గడ్డపై భారత్:
భారత జట్టుతో పాటుగా టెస్టు సిరీస్ ఓటమితో పరువు కోల్పోయిన ఆసీస్ ఎలాగైనా వన్డే సిరీస్‌ను గెలుచుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రికార్డులపరంగా చూస్తే ఎంసీజీలో ఆస్ట్రేలియాతో ఆడిన 14 వన్డేల్లో భారత్ తొమ్మిదింటిలో ఓటమికి గురైంది. చివరిసారిగా సీబీ సిరీస్‌లో భాగంగా 2008లో ఓ మ్యాచ్ గెలిచింది.

పిచ్, వాతావరణం:
డ్రాప్ ఇన్ పిచ్. పేసర్లకు బౌన్స్, స్వింగ్ లభిస్తుంది. పెద్ద బౌండరీ లైన్ కారణంగా స్పిన్నర్లు కచ్చితంగా ప్రభావం చూపుతారు. 

జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఎంఎస్ ధోనీ, కేదర్ జాదవ్, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, షమీ, చాహల్
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), క్యారీ, ఖవాజా, షాన్ మార్ష్, హ్యాండ్స్‌కోంబ్, స్టోయినిస్, మ్యాక్స్‌వెల్, సిడెల్, రిచర్డ్‌సన్, జంపా, స్టాన్‌లేక్.