CSK vs KKR : కోల్‌కతా, చెన్నైలో ఆధిపత్యం ఎవరిది? పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్, చెపాక్ స్టేడియం గణాంకాలు..
శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

IPL 2025 CSK vs KKR Head to head Chennai pitch report
ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడింది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆ తరువాత ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ వరుసగా ఓడిపోయింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.
MS Dhoni-Robin Uthappa : రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు.. ధోని కెప్టెన్ అయినంత మాత్రానా.
ఇలాంటి సమయంలో రెగ్యులర్ కెప్టెన్, ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు దూరం కావడం చెన్నై కష్టాలను మరింత పెంచే విషయం. రుతురాజ్ గైక్వాడ్ దూరం కావడంతో అతడి స్థానంలో మరోసారి చెన్నై కెప్టెన్సీ బాధ్యతలను ఎంఎస్ ధోని అందుకున్నాడు. చెన్నైకి ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ధోని.. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న జట్టును ఎలా ముందుకు తీసుకువెళతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అటు కోల్‌కతా నైట్‌రైడర్స్ పరిస్థితి పెద్ద గొప్పగా ఏమీ లేదు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ మెగాటోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లో గెలవగా, మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతోంది. రానురాను ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కేకేఆర్ జాగ్రత్త పడకపోతే కష్టాలు తప్పకపోవచ్చు.
పిచ్ రిపోర్టు..
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పిచ్ బౌలర్లకు అనుకూలం. ముఖ్యంగా స్పిన్నర్లు ఈ పిచ్ పై ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటారు. బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. పవర్ ప్లేలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయడం పై దృష్టి సారించాలి. మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేయడం కీలకం. ఈ పిచ్ పై టాస్ గెలిస్తే ఎక్కువగా జట్లు మొదట బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపుతూ ఉంటాయి.
వాతావరణం..
ఈ మ్యాచ్‌కుఎలాంటి వర్షం ముప్పు లేదు. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 26 డిగ్రీలకు ఉండే అవకాశం ఉందని ఆక్యూ వెదర్ తెలిపింది.
హెడ్ టు హెడ్..
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 30 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో చెన్నై 19 మ్యాచ్‌ల్లో గెలిచింది. కోల్‌కతా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
చెపాక్ గణంకాలు..
చెపాక్ స్టేడియంలో ఇప్పటి వరకు 88 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 51 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 37 సార్లు లక్ష్యాన్ని ఛేదించిన జట్లు విజయాన్నా అందుకున్నాయి. ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. 2010లో రాజస్థాన్ రాయల్స్ పై 246/5 స్కోరు సాధించింది. ఇక అత్యల్ప స్కోరు రాయల్ చాలెంజర్స్ పేరిట ఉంది. 2019లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 70 పరగులకు ఆలౌటైంది.