IPL 2025: రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు పూర్తి గులాబి రంగు జెర్సీతో మైదానంలోకి.. కారణం ఏంటో తెలుసా..?
రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్లు పూర్తిగా గులాబి రంగు జెర్సీని ధరించి మైదానంలోకి వచ్చారు. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది.

Rajasthan Royals
IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్ (mumbai indians) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (rajasthan royals) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత ముంబై జట్టు బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (53), రికిల్టన్ (61) దూకుడుగా ఆడారు. దీంతో తొలి వికెట్ కు 116 పరుగులు చేశారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (48 నాటౌట్), హార్దిక్ పాండ్యా (48నాటౌట్) దూకుడుగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో ముంబై జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 217 పరుగులు చేసింది.
ముంబై జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. వైభవ్ సూర్యవంశీ డకౌట్ కాగా.. కొద్దిసేపటికే యశస్వీ జైస్వాల్, నితీశ్ రాణా ఇలా అందరూ తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టారు. దీంతో 16.1 ఓవర్లలో 117 పరుగులకే రాజస్థాన్ ఆలౌట్ అయింది. ఫలితంగా 100 పరుగుల తేడాతో ముంబై జట్టు విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్లు పూర్తిగా గులాబి రంగు జెర్సీని ధరించి మైదానంలోకి వచ్చారు. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఈ మ్యాచ్ కు అమ్ముడు పోయిన ప్రతి టికెట్ నుంచి వంద రూపాయలను రాజస్థాన్ గ్రామీణ మహిళల స్వయం సంవృద్ధికి ఉపయోగించనున్నారు. అంతేకాకుండా ‘పిక్ ప్రామిస్ డే’ పేరుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ధరించిన గులాబి రంగు జెర్సీలను అమ్మడం ద్వారా వచ్చే డబ్బులుకూడా సేవ కార్యక్రమాలకే ఉపయోగించనున్నారు. ఈ మొత్తం నేరుగా రాజస్థాన్ రాయల్స్ ఫౌండేషన్ కు వెళ్లనుంది. రాజస్థాన్ లోని సాంబార్ ప్రాంతంలో సౌరశక్తి ద్వారా కొన్ని ఇండ్లకు విద్యుత్ ఇవ్వడం కూడా ఈ మ్యాచ్ లక్ష్యాల్లో ఒకటి.