Joe Root : సచిన్ రికార్డులపై కన్నేసిన ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు.. అడిగితే ఆసక్తికర సమాధానం..
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

Joe Root opens up on approaching Sachin Tendulkar all time Test runs record
Joe Root – Sachin Tendulkar : ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. టెస్టుల్లో వరుసగా శతకాలు బాదుతూ పోతున్నాడు. సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ తరుపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు అలెస్టర్ కుక్ రికార్డును బ్రేక్ చేశాడు.
అలెస్టర్ కుక్ టెస్టుల్లో ఇంగ్లాండ్ తరుపున 33 సెంచరీలు చేయగా.. తాజా శతకంతో రూట్ (34శతకాలు) అతడిని అధిగమించాడు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో పదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంకో సెంచరీ బాదితే ఏకంగా ఆరో స్థానానికి చేరుకుంటాడు.
ఈ నేపథ్యంలో టెస్టుల్లో సచిన్ అత్యధిక శతకాలు, పరుగుల రికార్డులను జో రూట్ అధిగమిస్తాడనే చర్చ జోరందుకుంది. అత్యధిక పరుగుల జాబితాలో జోరూట్ ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే ప్రశ్న రూట్‌కు అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. రికార్డుల కోసం తాను ఆడనని అన్నాడు. జట్టు విజయం సాధిచేందుకు తన వంతుగా పరుగులు చేస్తానని అన్నాడు. సెంచరీ చేయడం వ్యక్తిగతంగా ఆనందమే అయితే.. జట్టు గెలిస్తే అందుకు రెట్టింపు ఆనందం సొంతం అవుతుందన్నాడు.
నా ఆటను ఆడేందుకు మాత్రమే ప్రయత్నిస్తా. రికార్డుల గురించి పట్టించుకోను. ఇలాగే మరిన్ని రోజులు ఫామ్‌తో కొనసాగడం పైనే ప్రస్తుతం నా దృష్టంతా ఉంది. అని రూట్ అన్నాడు.
టెస్ట్‌లో అత్యధిక సెంచరీలు, పరుగుల రికార్డు ప్రస్తుతం భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ టెస్టుల్లో 51 శతకాలు బాదాడు. 15,921 పరుగులు చేశాడు. సచిన్ రికార్డును అందుకోవాలంటే రూట్ మరో 18 సెంచరీలు చేయాల్సి ఉంటుంది. అలాగే అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేయాలంటే ఇంకో 3,544 పరుగులను రూట్ చేయాలి. ప్రస్తుతం టెస్టుల్లో రూట్ 12,377 పరుగులు చేశాడు. 2021 నుంచి 48 టెస్టులు ఆడిన రూట్ 4,554 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతడి వయసు 33 ఏళ్లు. మరో నాలుగైదు ఏళ్ల పాటు అతడు సుదీర్ఘ ఫార్మాట్ ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పటి వరకు రూట్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే రికార్డులను బద్దలు కొట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు.