Kris Srikkanth – Shubman Gill : గిల్‌కు అంత సీన్ లేదు.. కృష్ణమాచారి శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..
గిల్ పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు.

Kris Srikkanth fires on Shubman Gill he is Highly Overrated player
ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఘోరంగా విఫలమైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో బౌలర్లు ఫర్వాలేదనిపించినా బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. యశస్వి జైస్వాల్ (10 ఇన్నింగ్స్‌ల్లో 390 పరుగులు), నితీశ్ కుమార్ రెడ్డి (9 ఇన్నింగ్స్‌ల్లో 298) లు రాణించారు. ఇక భవిష్యత్తులో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు అవుతాడని ఎన్నో అంచనాలు ఉన్న శుభ్‌మన్ గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 18.60 సగటుతో 93 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 31. ఈ క్రమంలో గిల్ పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు.
గిల్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్ అని మండిపడ్డాడు. ఈ విషయాన్ని తాను ఎన్నో సార్లు చెప్పానని అన్నాడు. అయినప్పటికి తన మాటను ఎవ్వరూ పట్టించుకోలేదన్నాడు. అతడికి ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయని అన్నాడు. ఏదో ఒక మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్ ఆడి జట్టులో తన స్థానాన్ని నిలుపుకుంటున్నాడు తప్ప అతడిలో ప్రత్యేకమైన టాలెంట్ అంటూ ఏమీ లేదన్నాడు.
Yuzvendra Chahal : విడాకుల వార్తల వేళ.. మిస్టరీ గర్ల్‌తో చాహల్..! ఎవరా అమ్మాయి..?
స్వదేశంలోని పిచ్‌లపైనా ఎవ్వరైనా పరుగులు చేస్తారని, అయితే.. విదేశాల్లో పరుగులు చేయడం గొప్ప విషయం అని అన్నారు. ఈ విషయంలో కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు తమను తాము నిరూపించుకున్నారని శ్రీకాంత్ తెలిపాడు. గిల్‌కు లభించినన్ని అవకాశాలు మరెవరికి లభించడం లేదన్నాడు. సూర్యకుమార్ వంటి టెక్నిక్ ఉన్న ఆటగాళ్లకు సైతం టెస్టుల్లో ఛాన్సులు రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నాడు.
‘అవును సూర్యకుమార్ యాదవ్‌కు టెస్టుల్లో మంచి ఆరంభం లేదు. అయినప్పటికి అతడి టెక్నిక్ బాగుంటుంది. అయితే సెలకర్టు, మేనేజ్‌మెంట్ లు సూర్యను వైట్‌బాల్ స్పెషలిస్ట్‌గా ముద్రవేశాయి.’ అని శ్రీకాంత్ చెప్పాడు.
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయినప్పటికి అలాంటి వారిని ఎంపిక చేయడం లేదు. యువ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వడానికి బదులుగా గిల్‌కే అవకాశాలు ఇస్తున్నారు అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు.
స్వదేశంలో పరుగుల వరద పారించే గిల్ విదేశాల్లో ఇప్పటి వరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు. 2021లో అరంగేట్రం చేసినప్పటి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ దేశాల్లో 18 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ మ్యాచుల్లో అతడి అత్యధిక స్కోరు కేవలం 36 పరుగులు మాత్రమే కావడం గమనార్హం.
మొత్తంగా ఇప్పటి వరకు గిల్ 32 టెస్టులు ఆడాడు. 35 సగటుతో 1893 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.