WPL 2026 : ముంబై ఇండియన్స్ పై ఘన విజయం.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చిన డబ్ల్యూపీఎల్ నిర్వాహకులు.. భారీ జరిమానా..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ లిజెల్ లీకి డబ్ల్యూపీఎల్ నిర్వాహకులు (WPL 2026) జరిమానా విధించారు.
Lizelle Lee fined for Code of Conduct breach in WPL 2026 (pic credit@wplt20)
- ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ
- ఢిల్లీ ప్లేయర్‌కు డబ్ల్యూపీఎల్ నిర్వాహకులు షాక్
- మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా ఇంకా
WPL 2026 : మరో మ్యాచ్ ఓడితే డబ్ల్యూపీఎల్ సీజన్ 4లో ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యే స్థితిలో మంగళవారం ముంబై ఇండియన్స్‌తో తలపడిన ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో ఢిల్లీ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు డబ్ల్యూపీఎల్ నిర్వాహకులు షాక్ ఇచ్చారు. ఢిల్లీ స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ బ్యాటర్ లిజెల్ లీకి భారీ జరిమానా విధించారు. అంతేకాదండోయ్ ఆమె ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు సాధించింది. ముంబై బ్యాటర్లలో నాట్ సీవర్ (65 నాటౌట్; 45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా హర్మన్‌ప్రీత్ కౌర్ (41; 33 బంతుల్లో 7 ఫోర్లు) రాణించింది. ఢిల్లీ బౌలర్లలో తెలుగమ్మాయి శ్రీ చరణి మూడు వికెట్లు తీసింది. మరిజేన్ కాప్ గొప్పగా బౌలింగ్ చేసింది. నాలుగు ఓవర్లు వేసి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టింది.
ఆ తరువాత జెమీమా రోడ్రిగ్స్ (51 నాటౌట్; 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), లిజెల్ లీ(46; 28 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), షెఫాలి వర్మ (29; 24 బంతుల్లో 6 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో 155 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది.
లిజెల్ లీకి జరిమానా..
ఈ మ్యాచ్‌లో చాలా బాగా ఆడిన లిజెలీ హాఫ్ సెంచరీ నాలుగు పరుగుల దూరంలో ఔట్ అయింది. ఢిల్లీ ఇన్నింగ్స్ 11 ఓవర్‌లో ఆమె పెవిలియన్‌కు చేరుకుంది. అమన్ జోర్ కౌర్ బౌలింగ్‌లో భారీ షాట్ కు లీ యత్నించింది. అయితే.. బంతి మిస్ కాగా.. వికెట్ కీపర్ రాహిలా ఫిర్దోజ్ వికెట్లను పడగొట్టింది. ఫీల్డ్ అంపైర్ .. థర్డ్ అంపైర్ సాయం కోరగా.. పలుమార్లు రిప్లేలు పరిశీలించిన అనంతరం బెయిల్స్ లేచిన సమయంలో ఆమె కాలు క్రీజు బయట ఉందని స్టంపౌట్ అని నిర్ణయం వెలువరించారు.
IND vs NZ : భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్.. ఆనందంలో టీమ్ఇండియా!
దీనిపై లీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆ సమయంలో కాలు క్రీజులోనే ఉందని ఆమె ఫీల్డ్ అంపైర్‌తో కాసేపు వాదించింది. ఆ తరువాత తన బ్యాట్‌ను గట్టిగా నేలపై కొడుతూ పెవిలియన్‌కు నడుచుకుంటూ వెళ్లింది. ఇది నిబంధన ఉల్లంఘన కిందకే వస్తుంది.
‘మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాల దుర్వినియోగానికి సంబంధించిన ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం లీ లెవల్ 1 నేరానికి పాల్పడింది. ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధిస్తున్నాం. ఆమె ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ చేర్చబడుతుంది. ఇక చేసిన తప్పును విధించిన శిక్షను ఆమె అంగీకరించింది. దీనిపై తదుపరి ఎలాంటి విచారణ ఉండదు.’ అని డబ్ల్యూపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
