Champions Trophy: అందుకే బాగా ఆడలేకపోయాం.. ఇకపై మాత్రం..: ఓటమి బాధతో పాకిస్థాన్‌ కెప్టెన్‌ ఏం చెప్పాడో తెలుసా?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత, పాకిస్థాన్ తన తదుపరి సిరీస్ కోసం న్యూజిలాండ్‌కు వెళ్లనుంది.

Champions Trophy: అందుకే బాగా ఆడలేకపోయాం.. ఇకపై మాత్రం..: ఓటమి బాధతో పాకిస్థాన్‌ కెప్టెన్‌ ఏం చెప్పాడో తెలుసా?

Updated On : February 27, 2025 / 9:04 PM IST

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్-ఏలో గురువారం రావల్పిండిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దు చేశారు అంపైర్లు. ఇంతకు ముందు భారత్, న్యూజిలాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్ లలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఓడిపోవడం వల్ల పాయింట్స్ టేబుల్ లో చివరి రెండు స్థానాలకు పరిమితమై ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్, బంగ్లా వైదొలిగాయి.

న్యూజిలాండ్, భారత్‌లో జరిగిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయినా పాక్ కనీసం చివరి మ్యాచ్ బంగ్లాదేశ్ పై గెలిచి పరువు నిలబెట్టుకుందామనుకుంటే వరుణుడి రూపంలో నిరాశే ఎదురైంది. కేవలం ఒకే ఒక్క పాయింట్‌తో గ్రూప్ ఏలో చివరి స్థానంలో నిలిచింది.

Champions Trophy: పాక్‌, బంగ్లా మ్యాచ్‌ వర్షార్పణం.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న జట్లు ఏవో తెలుసా? నెక్స్ట్‌ ఏంటి?

మ్యాచ్ రద్దయిన అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మీడియాతో మాట్లాడుతూ.. తమ దేశ ప్రజల అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయామని, ముఖ్యమైన ఆటగాళ్లు గాయపడడం వల్ల తాము అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయామని చెప్పారు. ఇది తమకు చాలా నిరాశ కలిగించిందని తెలిపారు.

గత ఏడాది ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే వంటి దేశాలతో జరిగిన వన్డే సిరీస్‌ల విజయాల్లో కీలక పాత్ర పోషించిన సైమ్ అయూబ్ గాయపడటంతో జట్టులో దాని ప్రభావం బాగా పడిందని చెప్పారు.

తాము గత కొన్ని మ్యాచ్‌ల్లో తప్పులు చేశామని, వాటి నుండి గుణపాఠాలు నేర్చుకుని న్యూజిలాండ్‌లో పకడ్బందీ ప్లాన్లతో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ముఖ్యంగా, ఇక్కడ పాకిస్థాన్‌లో న్యూజిలాండ్‌తో ఆడినప్పుడు చేసిన తప్పులను సరిదిద్దుకుని, ఆ దేశంలో మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నామని అన్నారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత, పాకిస్థాన్ తన తదుపరి సిరీస్ కోసం న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.