MI vs KKR: కమ్మిన్స్ కుమ్మినా కుదరలేదు.. కోల్‌కత్తాపై ముంబై ఘన విజయం

MI vs KKR: ఐపిఎల్ 2020లో 32వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో కోల్‌కతాకు ఇది నాలుగో ఓటమి. కోల్‌కత్తాపై 16.5ఓవర్లలో 149పరుగులు చేసి 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కీపర్ డీకాక్.. 44బంతుల్లో 78పరుగులు చేసి నాటౌట్‌గా అధ్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
అంతకు ముందు, టాస్ గెలిచిన తరువాత కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసి 5వికెట్ల నష్టానికి నిర్ణీత 20ఓవర్లలో 148పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం అవగా.. కమ్మిన్స్ 53పరుగులు చేసి కోల్‌కత్తా స్కోరును గౌరవప్రదమైన స్థానంలో పెట్టాడు. త్రిపాఠి 7, నితీష్ రానా 5, దినేష్ కార్తీక్ 4 పరుగులే చేయగా.. గిల్ మాత్రమే 21పరుగులు చేశాడు. 11 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కమ్మిన్స్ జోడి అద్భుతంగా ఆడి 87 పరుగులు చేశారు.
ఓపెనర్‌గా వచ్చి ఏడు పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్‌లో పాయింట్ దిశగా షాట్‌కు ప్రయత్నించి ఫస్ట్ వికెట్‌గా త్రిపాఠి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ మెరుపు వేగంతో గాల్లోకి ఎగిరి బంతిని అద్భుతంగా పట్టుకున్నాడు. ఇది లీగ్‌లో బౌల్ట్‌కు 50వ వికెట్.. రెండవ వికెట్‌గా రానా 5పరుగులు చేసి కౌల్టర్‌నైల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ డికాక్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
మూడవ వికెట్‌గా గిల్.. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వెంటనే చాహర్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి దినేశ్ కార్తీక్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఐదవ వికెట్‌గా బుమ్రా వేసిన షార్ట్ బంతిని అంచనా వేయడంలో విఫలమై రస్సెల్ 9బంతుల్లో 12పరుగులు చేసి వికెట్‌కీపర్ డికాక్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాచ్ భారం మొత్తం కెప్టెన్ మోర్గాన్‌పై పడింది. మోర్గాన్‌కు తోడుగా వచ్చిన పాట్ కమ్మిన్స్ అధ్భుతంగా ఆడాడు. టీ 20 క్రికెట్‌లో కమ్మిన్స్‌కు తొలి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఈ సమయంలో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు.
కమ్మిన్స్ తో పాటు, కెప్టెన్ ఎయోన్ మోర్గెన్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 29 బంతుల్లో అజేయంగా 39 పరుగులు చేశాడు. ఆరవ వికెట్‌కు ఇద్దరూ అజేయంగా 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అదే సమయంలో ముంబై తరఫున రాహుల్ చాహర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన కోటాలోని నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బోల్ట్, కౌల్టర్ నైల్, జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కో వికెట్ సాధించారు.
అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ముంబై ఇండియన్స్‌కు గొప్ప ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 10.3 ఓవర్లలో 94 పరుగులు జోడించారు. ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేసి రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. తరువాత సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.
తర్వాత డికాక్ కోల్‌కతా బౌలర్లపై విరుచుకు పడ్డారు. కేవలం 44 బంతుల్లో 78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సమయంలో, అతని స్ట్రైక్ రేటు 177.27. తన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లో డికాక్ 9 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. హార్దిక్ పాండ్యా 11 బంతుల్లో 21 పరుగులు చెయ్యగా.. 16.5 ఓవర్లలో తన జట్టు విజయం సాధించింది. కోల్‌కత్తా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివం మావి చెరొక వికెట్ తీశారు. చక్రవర్తి తన కోటాలోని నాలుగు ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
आवाज कोणाचा? ??#OneFamily #MumbaiIndians #Dream11IPL #MIvKKR pic.twitter.com/jpewj70okx
— Mumbai Indians (@mipaltan) October 16, 2020