సిరీసే లక్ష్యం : టీ 20..ఇండియాను కివీస్ ఆపగలదా

కివీస్ గడ్డపై తొలి టీ20 సిరీస్ కైవసానికి కోహ్లీసేన అడుగు దూరంలో నిలిచింది. 2020, జనవరి 29వ తేదీ బుధవారం జరిగే మూడో మ్యాచ్‌లోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. సెడాన్ పార్క్‌లో మూడో పోరులో విజయం సాధిస్తే సిరీస్ కోహ్లీసేన సొంతం అవుతుంది. టీమ్ ఇండియాకు గతంలో ఎన్నడూ లేని ఘనత దక్కుతుంది. సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేస్తే ఐసీసీ ర్యాంకుల్లో ముందుకు వెళ్లొచ్చు. చాన్నాళ్లుగా జట్టు ఐదో స్థానంలోనే ఉంటోంది. ఇప్పుడు ఒక మెట్టు ఎక్కొచ్చు.
టీమిండియా బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో ఉండటంతో కెప్టెన్ కోహ్లీకి టెన్షన్ తప్పింది. కేఎల్ రాహుల్‌ను ఏ ఆర్డర్‌లో పంపినా అదరగొడుతున్నాడు. పరుగులు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. గాయం కారణంగా పంత్ దూరం కావడంతో కీపర్‌గా వచ్చి కొత్త సమీకరణాలకు తెరలేపాడు. ఇక- శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో నిఖార్సైన బ్యాట్స్‌మెన్‌లా పరిణతి ప్రదర్శిస్తున్నాడు. అవసరమైనప్పుడు దూకుడుగా… పరిస్థితిని బట్టి నిలకడగా ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు.
మూడో వన్డేలో భారత జట్టులో పెద్ద మార్పులేవీ ఉండకపోవచ్చు. చిన్న మైదానం కాబట్టి ఈడెన్‌లో చాహల్‌కు వరుసగా రెండు అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు తలపడే సెడాన్ పార్క్ పెద్ద మైదానం. బౌండరీ సరిహద్దులు సాధారణంగానే ఉంటాయి. అందుకే కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టడం టీమ్‌ఇండియా శిబిరంలో ఉత్సాహం నింపింది. అతడిని ఆదర్శంగా తీసుకొని మిగతా పేసర్లు రాణిస్తున్నారు.
* న్యూజిలాండ్ గడ్డపై భారత్ ఇప్పటి వరకు టీ20 సిరీస్ గెలవలేదు.
* 2009లో ధోనీ సారథ్యంలోని జట్టు 0-2తో ఓటమి పాలైంది.
* గతేడాది మూడు మ్యాచుల సిరీస్ చిక్కినట్టే చిక్కి 1-2తో చేజారింది.
* ప్రపంచకప్ ఉండటంతో ఈసారి ఐదు టీ20ల సిరీస్‌లో తలపడుతోంది.
* ఈడెన్ పార్క్‌లో 6, 7 వికెట్లతో విజయ దుందుభి మోగించింది.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్‌కు ప్రస్తుత వరుస ఓటములు అవమానంగా మారాయి. బౌలింగ్ పరంగా ఆ జట్టులో ఇబ్బందులేమీ లేవు. పేసర్లు, స్పిన్నర్లు రాణిస్తున్నారు. కానీ భారత్ బ్యాట్స్‌మెన్ వారిని సమర్థంగా ఎదుర్కొంటున్నారు. బుమ్రా, జడేజా, చాహల్, షమి బౌలింగ్ ఆడేందుకు ఆతిథ్య బ్యాట్స్‌మెన్ జంకుతున్నారు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌లో ఆడటం ఎంత కష్టంగా ఉందో టిమ్ సీఫెర్ట్ ఇప్పటికే చెప్పాడు. ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌కు ఇదే చివరి అవకాశం. రెండు మ్యాచుల్లో అతడు 0, 3 పరుగులతో విఫలమయ్యాడు. ఈ సారి రాణించకపోతే అతడి స్థానంలో బ్యాట్స్‌మన్ టామ్ బ్రూస్‌ను తీసుకోవచ్చు.
ఆక్లాండ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. కానీ సెడాన్‌లో మాత్రం కివీస్‌కు మంచి రికార్డే ఉంది. అక్కడ ఆడిన 9 టీ20ల్లో 7 గెలిచింది. ఇదే ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు బరిలోకి దిగుతోంది. సెడాన్ ఎక్కువగా బ్యాట్స్‌మెన్‌కే అనుకూలం. గతంలో భారీ స్కోర్లూ నమోదయ్యాయి. మైదానం పచ్చికతో కళకళలాడుతుంది. ఇక్కడ 11 టీ2లు జరగ్గా… ఛేదనలో 5, మొదట బ్యాటింగ్ చేసినవి 6 గెలిచాయి.
Read More : Man vs Wild : ఆయామ్ ఆల్ రైట్..డోంట్ వర్రీ – రజనీకాంత్