హైదరాబాద్ నుంచి ఒకే ఒక్కడు.. ఐపీఎల్ పోరులో సందీప్!

  • Published By: vamsi ,Published On : August 20, 2020 / 02:04 PM IST
హైదరాబాద్ నుంచి ఒకే ఒక్కడు.. ఐపీఎల్ పోరులో సందీప్!

Updated On : August 20, 2020 / 2:54 PM IST

ఐపీఎల్ వేలం సమయంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హైదరాబాద్‌ కుర్రాడు బావనక సందీప్‌. హైదరాబాద్‌‌లోని రామ్‌నగర్‌కు చెందిన 27 ఏళ్ల యువ ఆటగాడు బావనక సందీప్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. లక్షలాది మంది హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానుల ఆకాంక్షలను మూటగట్టుకొని ఐపీఎల్‌లో ఆడేందుకు శుక్రవారం(ఆగస్ట్ 21న)బయలుదేరి వెళ్తున్నాడు భావనక సందీప్‌.



కరోనా కారణంగా వాయిదాపడిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 19వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున యూఏఈకి ప్రత్యేక చాపర్‌లో వెళ్లబోతున్నాడు సందీప్. యూఏఈలో ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న అనంతరం జట్టు సభ్యులు నెట్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించనున్నారు. సన్‌రైజర్స్‌ జట్టులో హైదరాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడు భావనక సందీప్‌.

18 ఏళ్ల వయసులో 2010లో రంజీల్లో అరంగేట్రం చేసిన సందీప్.. తన మొదటి మ్యాచ్‌లోనే జార్ఖండ్‌పై సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు సందీప్. 75 ఏళ్ల హైదరాబాద్‌ రంజీ చరిత్రలో మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 54 రంజీ మ్యాచ్‌లు ఆడి 48.5 యావరేజితో దూసుకుపోతున్నాడు సందీప్.



తన క్రికెట్ కెరీర్‌లో మొత్తం 7 సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ, 21 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ అయిన సందీప్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ రంజీ టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. సందీప్‌ మూడో తరగతి వరకు రామ్‌నగర్‌లోని మదర్స్‌ హైస్కూల్‌లో చదువుకున్నాడు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈస్ట్‌ మారేడ్‌పల్లిలోని సెయింట్‌ ఆండ్రూస్‌ హైస్కూల్‌లో ఆ తర్వాత సెయింట్‌ జాన్స్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్, బీటెక్‌‌ను తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో పూర్తి చేశాడు. అనంతరం స్పోర్ట్స్‌ కోటాలో ఇన్‌కమ్ ట్యాక్స్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం లభించింది.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో తన నైపుణ్యాన్ని చాటుతూ తన చిరకాల స్వప్నమైన ఐపీఎల్‌లో స్థానం దక్కించుకున్న సందీప్.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అభిమానుల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు తప్పకుండా ప్రయత్నిస్తానని అన్నారు.