LSG vs SRH : ఐపీఎల్ 2025 నుంచి లక్నో ఔట్.. కెప్టెన్ రిషబ్ పంత్ కీలక వ్యాఖ్యలు.. దాని గురించి మాట్లాడొద్దని..
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది. సోమవారం ఎకానా స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో లక్నో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన లక్నోకు ఇది ఏడో పరాజయం.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (65; 39 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఐడెన్ మార్‌క్రమ్ (61; 38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాప్ సెంచరీలు బాదగా నికోలస్ పూరన్ (45; 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఎషాన్ మలింగ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం అభిషేక్ శర్మ (59; 20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు), హెన్రిచ్ క్లాస్ (47; 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (35; 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కమిందు మెండిస్ (32; 21 బంతుల్లో 3 ఫోర్లు) దంచికొట్టడంతో లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. లక్నో బౌలర్లలోదిగ్వేష్ రతి రెండు వికెట్లు తీశాడు.
అవే దెబ్బతీశాయి.. పంత్
కాగా.. ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ చేరుకోకుండానే నిష్ర్కమించడంపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు. వేలం తరువాత కీలక బౌలర్లు గాయాల పాలు కావడం తమ కొంపముంచిందని, వారి లోటును పూడ్చలేకపోయామని అంగీకరించాడు.
‘ఇది మా బెస్ట్ సీజన్ అవుతుందని అనుకున్నాం. కానీ చాలామంది ఆటగాళ్లు గాయాల వల్ల టీమ్‌కు అందుబాటులో లేకుండా పోయారు. ఈ ఖాళీలను మేం సరిగా భర్తీ చేయలేకపోయాం. నిజానికి మేం ఈ విషయాల గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నాం. కానీ ఆ ఖాళీలను పూరించడం మాకు చాలా కష్టమైంది.’ అని పంత్ అన్నాడు.
సీజన్ ప్రారంభంలో లక్నో ప్రధాన పేసర్లుమొహ్సిన్ ఖాన్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్‌లతో గాయాల కారణంగా లక్నో గణనీయంగా ప్రభావితమైంది. ఈ విషయం పై పంత్ మాట్లాడుతూ.. మేము వేలంలో ప్లాన్ చేసిన విధానం, అదే బౌలింగ్ ఉంటే.. పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. కానీ ఇది క్రికెట్ కొన్ని విషయాలు మనకు అనుకూలంగా ఉంటాయి. మరి కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు. ఇక ఈ సీజన్ నుంచి తాము ప్రతికూల అంశాలపై కంటే సానుకూల అంశాలపైనే దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చాడు.
బలమైన బ్యాటింగ్ లైనప్ ఉందని, తగినంత మంది హార్డ్ హిట్టర్లు ఉన్నారని, ఈ సీజన్‌లో మాకు అతి పెద్ద సానుకూలత ఇదేనని పంత్ తెలిపాడు. సీజన్ ఆరంభంలో తాము చాలా బాగా ఆడామని చెప్పాడు. కానీ రెండో అర్థభాగంలో జట్లతో పోటీపడలేకపోయినట్లుగా అంగీకరించాడు. ఇక దిగ్వేష్ రతి చాలా బాగా ఆడాడని మెచ్చుకున్నాడు. అతడికి ఇది తొలి సీజన్ అయినప్పటికి అతడు బౌలింగ్ చేసిన విధానం బాగుంది అని అన్నాడు. మొత్తంగా ఈ సీజన్‌లో తాము ఆడిన విధానం పట్ల గర్వపడుతున్నాము అని తెలిపాడు.
Virat kohli : కోహ్లీ టెస్టు రిటైర్‌మెంట్ వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా? భయపడ్డాడా?