Rohit Sharma : టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ పై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..! ఛాంపియన్స్ ట్రోఫీ ఎంతపని చేసింది?
స్వదేశంలో కివీస్ చేతిలో ఓటమి, ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవలేకపోవడంతో పాటు వ్యక్తిగతంగానూ విఫలం కావడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఎసరు తప్పదని అంతా అనుకున్నారు.

Rohit Sharma Captaincy Call Already Taken By BCCI Before England Tests reports
గతకొన్నాళ్లుగా భారత జట్టు సుదీర్ఘ ఫార్మాట్‌లో తడబడుతోంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఓటమి, ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోలేకపోయింది. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ విఫలం అయ్యాడు. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో ఆసీస్‌తో సిరీస్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్‌లో తప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలుకుతాడని, అతడి స్థానంలో టెస్టులకు కొత్త కెప్టెన్‌ను నియమించడం ఖాయమని ఆసీస్ పర్యటన ముగియగానే వార్తలు వచ్చాయి.
ఐపీఎల్ ముగిసిన తరువాత జూన్ లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ పర్యటనలో భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-2027 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎవరు కెప్టెన్‌గా ఉంటారా? అన్న ఆసక్తి అందరిలో నెలకొందింది.
ఆసీస్ సిరీస్ ఓటమి తరువాత రిటైర్‌మెంట్ పై రోహిత్ శర్మ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. తాను మరికొంత కాలం పాటు ఆడతానని చెప్పుకొచ్చాడు. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్‌ను నిలపడం హిట్‌మ్యాన్‌కు బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. ఈ ఐసీసీ ట్రోఫీ రోహిత్ కెరీర్‌ను మరికొన్నాళ్ల పాటు పొడిగించిందని అంటున్నారు.
రోహిత్‌కు అండగా బీసీసీఐ..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలవడంతో.. బీసీసీఐ రోహిత్ కు ప్రమోషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరికొన్నాళ్ల పాటు అతడే టీమ్ఇండియా కెప్టెన్‌గా వ్యవహరించాలని నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
తాను ఏమి చేయగలడో ఇప్పటికే రోహిత్ శర్మ చూపించాడని, ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టును నడిపించడానికి అతడే సరైన అభ్యర్థి అని బీసీసీఐ అధికారులు భావిస్తున్నట్లు ఆంగ్లమీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక రోహిత్ కూడా సుదీర్ఘ ఫార్మాట్ ఆడేందుకు ఇష్టపడుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయానంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తాను వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం లేదని చెప్పుకొచ్చాడు. ఇలాంటి వదంతులను వ్యాప్తి చేయవద్దని కోరాడు. తనకు భవిష్యత్ ప్రణాళికలు అంటూ ఏమీ లేవన్నాడు. అదే సమయంలో ఎప్పటి వరకు జట్టులో కొనసాగుతాడో అన్న విషయాన్ని మాత్రం హిట్‌మ్యాన్ వెల్లడించలేదు.
అయితే.. 2027 వన్డే ప్రపంచకప్ ఆడి వీడ్కోలు పలకాలనే ఉద్దేశ్యంతో రోహిత్ శర్మ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వార్తలు రావడానికి ఓ కారణం ఉంది. ఎన్ని ప్రపంచకప్‌లు గెలిచినా.. తన దృష్టిలో మాత్రం వన్డే ప్రపంచకప్ గెలవడం అత్యుత్తమం అని, చిన్నప్పటి నుంచి ఆ ఫార్మాట్‌ను చూస్తూ పెరగడం కూడా ఇందుకు ఓ కారణం కావచ్చునని ఓ సందర్భంలో రోహిత్ శర్మ అన్నాడు.