Shane Watson : సీఎస్‌కే వరుస ఓటములు.. ధోని, ఫ్లెమింగ్‌లకు ఓ స్పష్టమైన ప్రణాళిక లేదు..
హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఎంఎస్ ధోనిలకు స్పష్టమైన ప్రణాళిక లేదని షేన్ వాట్సన్ అన్నాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతుంది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై ఈ సీజన్‌లో ఇబ్బందులు పడుతోంది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఓ మ్యాచ్‌లో గెలుపొందగా.. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ -0.891గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
మిగిలిన జట్లతో పోలిస్తే చెన్నై జట్టులో దూకుడు లోపించింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడుతుండగా, ధోని నిదానంగా ఆడుతుండడంతో ఆ జట్టుకు ఓటములు తప్పడం లేదు. ఈ క్రమంలో సీఎస్‌కే పరిస్థితిపై ఆ జట్టు మాజీ ఆటగాడు, కామెంటేటర్ షేన్ వాట్సన్ స్పందించాడు. హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఎంఎస్ ధోనిలకు స్పష్టమైన ప్రణాళిక లేదని అన్నాడు.
ఈ సీజన్‌ను సీఎస్‌కే విజయాలతో ప్రారంభించకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని షేన్ వాట్సన్ చెప్పాడు. చెన్నై జట్టులో ఆటగాళ్ల పాత్రలపై సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఎంఎస్ ధోనిలు స్పష్టంగా లేరని అర్థమవుతున్నాడు.
‘సీఎస్‌కే ఈ సీజన్‌ను ఇలా ప్రారంభించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్రతి మెగావేలం తరువాత సీఎస్‌కే మేనేజ్‌మెంట్ తమ కాంబినేషన్లలపై స్పష్టత తెచ్చుకుని లాక్ చేస్తుంది. అది బ్యాటింగ్ ఆర్డర్ లేదా బౌలింగ్ ఆప్షన్లు అయినా సరే. మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో ఇన్ని ప్రయోగాలు చేయడం చాలా అరుదు. నేను జట్టులో ఉన్నప్పుడు టోర్నీ ప్రారంభానికి ముందే.. ధోని, ఫ్లెమింగ్‌లు జట్టులోని ఆటగాళ్ల పాత్రల పై ఓ స్పష్టమైన అంచనాతో ఉండేవారు. ఎప్పుడో కానీ కొన్ని మార్పులు చేసేవారు. అయితే.. ప్రస్తుతం సమస్యలను సమాధానాలను వెతికే పనిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.’ అని వాట్సన్ అన్నాడు.
కాన్వే, రచిన్‌లు రాణిస్తే..
డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర అత్యుత్తమ ఓపెనింగ్ జోడి అని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. గత మ్యాచ్‌లో జట్టు బ్యాటింగ్ లైనప్ సమతుల్యతను కలిగిఉన్నట్లుగా కనిపించిందన్నాడు. కాన్వే, రచిన్ లు ఇన్నింగ్స్ ప్రారంభించారు. రుతురాజ్ మూడో స్థానంలో వచ్చాడు. అయితే.. అంతకముందు త్రిపాఠి ఓపెనర్‌గా వచ్చినప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో కొన్ని లోపాలు కలిగిఉన్నట్లుగా కనిపించింది. అని వాట్సన్ తెలిపాడు.
ఎంఎస్ ధోనీకి వాట్సన్ మద్దతు..
నెమ్మదిగా ఆడుతుండడం, మ్యాచ్‌లను ముగించడంలో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఎంఎస్ ధోనికి వాట్సన్ మద్దతు పలికాడు. ఇప్పటికి కూడా ధోని అద్భుతంగా ఆడుతున్నాడని, టాపార్డర్ సమర్ధవంతంగా ఆడితే ధోని మ్యాచ్‌లను ముగించగలడని చెప్పాడు. ప్రస్తుతం ధోని పని ఆఖరి ఓవర్లలో వస్తూ ఇన్నింగ్స్‌లను ముగించడం అని, మిగిలిన జట్టు అతడికి మద్దతు ఇవ్వాలని అన్నాడు.