India Vs Pakistan: ఇదేనా మీ దేశభక్తి..! భారత క్రికెటర్లని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. పాకిస్థాన్‌తో క్రికెట్ ఎలా ఆడతారు అంటూ ఫైర్..

శిఖర్ ధావన్, అఫ్రిది ఇద్దరూ నాటకాలు ఆడారు. యుద్ధం సమయంలో దేశభక్తి అంటూ నటించారు.

India Vs Pakistan: ఇదేనా మీ దేశభక్తి..! భారత క్రికెటర్లని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. పాకిస్థాన్‌తో క్రికెట్ ఎలా ఆడతారు అంటూ ఫైర్..

Updated On : July 19, 2025 / 11:16 PM IST

India Vs Pakistan: భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, ఇతర ఆటగాళ్ల బృందం జూలై 20న బర్మింగ్‌హామ్‌లో జరిగే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పొరుగు దేశం పాకిస్థాన్‌తో తలపడేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడీ మ్యాచ్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. మన క్రికెటర్లను నెటిజన్లు టార్గెట్ చేశారు. ఇదేనా మీ దేశభక్తి అంటూ వారిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా క్రికెటర్లను ఏకిపారేస్తున్నారు నెటిజన్లు.

వాస్తవానికి ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్.. ఇదేమీ కొత్త సీజన్ కాదు. పాతదే. ఇప్పటికే ఒక సీజన్ అయిపోయింది. తాజాది రెండవ సీజన్. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ తీవ్ర విమర్శలకు తావిచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. వారి కుటుంబసభ్యుల ముందే అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడితో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశంతో ఆటలేంటి? అని నెటిజన్లు మన క్రికెటర్లపై విరుచుకుపడుతున్నారు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ రాజకీయ నాయకులే కాదు అక్కడి క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు కూడా రెచ్చిపోయారు. భారత్ పై తీవ్ర స్థాయిలో విషం చిమ్మారు. భారత్ కు వ్యతిరేకంగా పాక్ లో ర్యాలీలు నిర్వహించారు. భారత్ ను నిందిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. షాహిద్ అఫ్రిదితో సహా చాలా మంది మాజీ, ప్రస్తుత పాకిస్తాన్ ఆటగాళ్ళు సోషల్ మీడియాలో భారతదేశంపై విద్వేషాన్ని వెళ్లగక్కారు. మరీ ముఖ్యంగా అఫ్రిది దారుణంగా ప్రవర్తించాడు. విజయోత్సవ ర్యాలీలు చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా దుర్భాషలాడాడు. దీనికి మన క్రికెటర్లు కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. శిఖర్ ధావన్ సైతం నిరసన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా అఫ్రిదికి గట్టిగా సమాధానం ఇచ్చాడు.

”కార్గిల్ లోనూ ఓడించాము. ఇప్పటికే మీరు దిగజారిపోయారు. ఇంకెంత దిగజారుతారు. పనికి రాని మాటలు మాట్లాడేకంటే.. మీ దేశాన్ని ఎలా మార్చాలో ఆలోచించు” అంటూ అఫ్రిదిని ఉద్దేశించి ధావన్ ఎక్స్ లో పోస్టు పెట్టాడు. ఏప్రిల్ ఇది జరిగింది. కట్ చేస్తే.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన రెండు నెలల్లోనే అదే అఫ్రిదితో శిఖర్ ధావన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుండటం గమనార్హం. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ధావన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదేనా మీ దేశభక్తి అంటూ నిలదీస్తున్నారు. భారతీయులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఆటగాళ్లతో ఆటలేంటి అని సీరియస్ అవుతున్నారు.

శిఖర్ ధావన్ మాత్రమే కాదు.. ప్రముఖ భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ సైతం ఈ మ్యాచ్ లో ఆడనున్నారు. పాకిస్తాన్ క్రికెటర్లు అఫ్రిది, మహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ తో వారు తలపడనున్నారు.

Also Read: లంచ్ బ్రేక్, టీ బ్రేక్ అంటారు.. అసలు అక్కడ క్రికెటర్లకి ఏం పెడతారు? వాళ్లు ఏం తింటారు?

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ను.. కొందరు భారతీయులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మన క్రికెటర్ల తీరుని తప్పుపడుతున్నారు. “హర్భజన్, యువరాజ్, ధావన్ వంటి భారత మాజీ క్రికెటర్లు సంతోషంగా WCL మ్యాచ్‌లను పాకిస్తాన్‌తో ప్రైవేట్ లీగ్‌లో ఆడుతున్నారు. అదే పబ్లిక్ మ్యాచ్ అనగానే.. వారు జాతీయవాదాన్ని తెరపైకి తెస్తారు. ఇదేమి ద్వంద్వ వైఖరి. ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? దేశభక్తి కేవలం సామాన్యులకేనా? సెలెబ్రిటీలకు కాదా? ఇది చాలా దారుణం ” అంటూ ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు.

శిఖర్ ధావన్, అఫ్రిది ఇద్దరూ నాటకాలు ఆడారు. యుద్ధం సమయంలో దేశభక్తి అంటూ నటించారు. నేను మళ్ళీ చెబుతున్నాను, దేశభక్తి సాధారణ ప్రజలకు మాత్రమే. ఇలాంటి సెలెబ్రిటీలకు ఉండదు. ఆసియా కప్ లోనూ భారత జట్టు పాకిస్తాన్ తో ఆడుతుంది చూడండి.. ” అంటూ మరొక నెటిజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ లో ఆడే భారత జట్టులో అంబటి రాయుడు, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, హర్భజన్ సింగ్ కూడా సభ్యులుగా ఉన్నారు. ఇక ఈ లీగ్‌లో భారత్, పాకిస్తాన్‌లతో పాటు ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఆటగాళ్ళు కూడా పాల్గొంటున్నారు.