భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

సౌతాఫ్రికాలో టీమిండియా బ్యాటర్ సంజూ శామ్సన్ చెలరేగాడు. నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీతో కదంతొక్కాడు.

భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

South Africa vs India 3rd ODI highlights and updates

Updated On : December 22, 2023 / 12:41 AM IST

Ind vs SA 3rd ODI : సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత్ అదరగొట్టింది. ఘన విజయం సాధించింది. 78 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు.. 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అర్షదీప్ 4 వికెట్లతో చెలరేగాడు. ఆవేశ్, సుందర్ తలో 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో 3వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.

మూడో వన్డేలో టీమిండియా బ్యాటర్లు సంజూ శామ్సన్, తిలక్ వర్మ చెలరేగారు. సంజూ శామ్సన్ సెంచరీ సాధించగా, తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేశాడు. 110 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో సంజూ  సెంచరీ చేశాడు. తిలక్ వర్మ 75 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 52 పరుగులు చేసి 4వ వికెట్ గా అవుటయ్యాడు. సెంచరీ చేశాక వేగంగా ఆడే క్రమంలో సంజూ 5వ వికెట్ గా పెవిలియన్ చేరాడు. 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులు బాదాడు.

టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. 49 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియాను సంజూ ఆదుకున్నాడు. మొదట ఆచితూచి ఆడిన సంజూ తర్వాత జోరు పెంచాడు. తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సంజూ గేర్ మార్చాడు. వేగంగా పరుగులు రాబట్టి జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 296 పరుగులు చేసింది. సౌతాఫ్రికా 297 పరుగుల ముందు టార్గెట్ ఉంచింది.

రజత్ పటిదార్ అరంగ్రేటం
టీమిండియా బ్యాటర్ రజత్ పటిదార్ వన్డేల్లో అరంగ్రేటం చేశాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ తో 22 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (10) ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ 21, రింకు సింగ్ 38, వాషింగ్టన్ సుందర్ 14 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో బ్యూరాన్ హెండ్రిక్స్ 3, నాండ్రే బర్గర్ 2 వికెట్లు పడగొట్టారు. లిజాద్ విలియమ్స్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీశారు.

Also Read: ఐపీఎల్ వేలం ముగిసింది.. అయినా ఇంకా ఛాన్స్ ఉంది.. ఎలాగంటే!

తుది జట్లు

భారత్
రజత్ పటిదార్, సాయి సుదర్శన్, సంజు శాంసన్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్

దక్షిణాఫ్రికా
రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్