WFI President Suspended: కేంద్ర క్రీడాశాఖ సంచలన నిర్ణయం.. డబ్ల్యూఎఫ్ఐ నూతన ప్యానెల్ రద్దు.. ఎందుకంటే?

డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో గెలిచిన నూతన ప్యానెల్ ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. భారతీయ రెజ్లింగ్ పోటీల నిర్వహణలో విధివిధానాలను అతిక్రమించిన కారణంగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపింది.

WFI President Suspended: కేంద్ర క్రీడాశాఖ సంచలన నిర్ణయం.. డబ్ల్యూఎఫ్ఐ నూతన ప్యానెల్ రద్దు.. ఎందుకంటే?

WFI President Suspended

Updated On : December 24, 2023 / 2:36 PM IST

Wrestling Federation of India : భారత రెజ్లర్లు చేస్తున్న ఆందోళనతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల్లో గెలిచిన కొత్త ప్యానెల్ ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. భారతీయ రెజ్లింగ్ పోటీల నిర్వహణలో విధివిధానాలను అతిక్రమించిన కారణంగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని కేంద్ర క్రీడాశాఖ తెలిపింది. డబ్ల్యూఎఫ్ఐకి కొత్తగా నియమితులైన సంజయ్ సింగ్ ను కూడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. సంజయ్ సింగ్ బీజేపీ ఎంపీ, మాజీ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు. సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికను రెజ్లర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యారు. బజరంగ్ పునియా కూడా తన పద్మశ్రీని వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

Also Read : IND vs SA 1st Test : కోహ్లీ వచ్చేశాడు.. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్టుకు అందుబాటులో విరాట్

డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికైన తరువాత అండర్ -15, అండర్ -20 జాతీయ రెజ్లింగ్ పోటీలను ఈ ఏడాది చివరినాటికి ఉత్తర ప్రదేశ్ లోని నందినీ నగర్, గోండాలో నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ, ఈ ప్రకటన డబ్ల్యూఎఫ్ఐ, క్రీడాశాఖ నిబంధనలకు విరుద్ధం. ఎందుకంటే పోటీని ప్రారంభించడానికి కనీసం 15రోజుల ముందు ప్రకటన ఇవ్వాలి. తద్వారా పోటీల్లో పాల్గొనేందుకు రెజ్లర్లు సిద్ధం కావచ్చు. అంతేకాక.. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఎగ్జిక్యుటివ్ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సబ్ జూనియర్, సీనియర్ రెజ్లింగ్ పోటీలను నిర్వహించాలి. కానీ, నిబంధనలు పాటించకుండా పోటీల నిర్వహణకు కొత్త ప్యానెల్ ప్రకటన విడుదల చేసింది. దీంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కొత్త ప్యానెల్ ను సస్సెండ్ చేసింది.

Also Read : BalaKrishna : అసెంబ్లీలో బాలయ్య విజిల్ వేసిన టాపిక్‌.. అన్‌స్టాపబుల్ షోలో మాట్లాడిన హరీష్ శంకర్..

రెజ్లర్లు, పలువురు క్రీడాకారులు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గీతా ఫొగట్ కేంద్రం నిర్ణయంపై ట్వీట్ చేశారు. క్రీడా మంత్రిత్వ శాఖ డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్ ను సస్పెండ్ చేసింది. ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. రెజ్లర్లకు న్యాయం జరుగుతుందనే ఆశను కలిగించిందని అన్నారు. ఇదిలాఉంటే..  కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయంపై సంజయ్ సింగ్ కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం న్యాయబృందం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే, క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయంపై సంజయ్ సింగ్ స్పందించారు.. ఇంకా ఆర్డర్ మొత్తం చదవలేదని, ముందు చదివి తర్వాత నా నిర్ణయం చెబుతానని అన్నారు.