IND vs AUS : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియా పై ఘన విజయం..
సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఆస్ట్రేలియా పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.
265 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (84; 98 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42 నాటౌట్) లు రాణించారు. అక్షర్ పటేల్ (27), రోహిత్ శర్మ (28) లు ఫర్వాలేదనిపించారు. శుభ్‌మన్ గిల్ (8) విఫలం అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడప్ జంపా, నాథన్ ఎల్లిస్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్ లు తలా ఓ వికెట్ సాధించారు.
ఇక దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య లాహోర్ వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో భారత్ పైనల్‌లో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మార్చి 9న) దుబాయ్ వేదికగా జరగనుంది..
IND vs AUS : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఐసీసీ వన్డే టోర్నీల్లో ఒకే ఒక్కడు..
లక్ష్య ఛేదనలో భారత్ కు శుభారంభం దక్కలేదు. ఓ వైపు రోహిత్ శర్మ తనదైన శైలిలో ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగగా మరోవైపు తొలి బంతి నుంచి ఇబ్బంది పడిన గిల్.. బెన్ ద్వార్షుయిస్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మరికాసేపటికే రోహిత్ శర్మ సైతం కూపర్ కొన్నోలీ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 43 పరుగులకే 2 రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతలను సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ భుజాన వేసుకున్నాడు.
అతడికి శ్రేయస్ అయ్యర్ చక్కని సహకారం అందించాడు. వీరిద్దరు సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో కోహ్లీ అర్థశతకం పూర్తి చేసుకోగా.. అర్థశతకానికి దగ్గరగా వచ్చిన అయ్యర్‌ను ఆడమ్ జంపా బోల్తా కొట్టించాడు. అయ్యర్-కోహ్లీ జోడి మూడో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. ఆ తరువాత కోహ్లీ.. అక్షర్ పటేల్‌తో నాలుగో వికెట్‌కు 44 పరుగులు, కేఎల్ రాహుల్‌తో ఐదో వికెట్‌కు 47 పరుగులు జోడించాడు.
స్కోరు వేగాన్ని పెంచేక్రమంలో కోహ్లీ ఐదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్‌తో కలిసి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (28; 24 బంతుల్లో 1ఫోర్, 3 సిక్సర్లు) కలిసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. 6 పరుగులు అవసరం అయిన దశలో సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాలని చూసి ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి రాహుల్ విజయాన్ని అందించాడు.
అంతకముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ(61)లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తీ, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.