WTC Final 2024: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి.. సమీకరణలు ఇలా..
కివీస్ తో మూడో టెస్టు తరువాత బోర్డర్ గావస్కర్ సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. అక్కడ ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది

Team india
WTC 2024-25: పన్నెడేళ్లుగా సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోని టీమిండియాకు న్యూజిలాండ్ జట్టు బ్రేక్ వేసింది. పేలవ ఫామ్ తో భారత గడ్డపై అడుగుపెట్టిన ఆ జట్టు.. సంచలన ప్రదర్శనతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టెస్టుల సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు చేరుకోవాలన్న టీమిండియా ఆశలకు గండిపడింది. న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ జట్టు 72శాతంతో అగ్రస్థానంలో ఉంది. కివీస్ పై వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన తరువాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ దాదాపు 72 శాతం నుంచి 62.82కు పడిపోయింది.
Also Read: IND vs NZ : రెండో టెస్టులో భారత్ ఓటమి.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్..
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ జట్టు 62.82 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా జట్టు 62.50శాతంతో రెండో స్థానంలో ఉంది. అంటే.. ఇరు జట్ల మధ్య తేడా కేవలం 0.32శాతం మాత్రమే. ఆ తరువాత స్థానాల్లో శ్రీలంక (55.56), న్యూజిలాండ్ (50), దక్షిణాఫ్రికా (47.62) అవకాశాలు మెరుగయ్యాయి. కివీస్ తో మూడో టెస్టు తరువాత బోర్డర్ గావస్కర్ సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. అక్కడ ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ జట్టు నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లలో కచ్చితంగా విజయం సాధించాల్సిందే. చివరి టెస్టులో న్యూజిలాండ్ జట్టును టీమిండియా ఓడిస్తే.. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ లో కనీసం మూడు మ్యాచ్ లలోనైనా విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ జట్టు ఆస్ట్రేలియాపైనా వరుస ఓటములను చవిచూస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ వెళ్లాలంటే మిగిలిన జట్లపైనే ఆధారపడాల్సి వస్తుంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో ఫైనల్ మ్యాచ్ చరిత్రలో రెండు సార్లు జరిగింది. 2021లో జరిగిన తొలి ఫైనల్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2023లో ఆస్ట్రేలియా – భారత్ జట్లు తలపడ్డాయి. కంగారు జట్టు 209 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు రెండు ఫైనల్స్ ఆడిన తొలి దేశ భారత్.
India’s lead at the top of the WTC table has been reduced to a thin margin after two straight losses #INDvNZ #PAKvENG pic.twitter.com/IYftv0JCXB
— ESPNcricinfo (@ESPNcricinfo) October 26, 2024