IPL 2025 : హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ముంబై కెప్టెన్ ఎవరు? ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ?
సీఎస్‌కేతో ముంబై ఇండియన్స్ ఆడనున్న తొలి మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు.

who can lead Mumbai Indians in Hardik Pandya absence in IPL 2025 opener
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవాలని అన్ని ఫ్రాంఛైజీలు కోరుకుంటున్నాయి. గతేడాది తీవ్రంగా నిరాశపరిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సారి ఎలాగైనా కప్పును సాధించాలన్న పట్టుదలతో ఉంది. అయితే.. ఆ జట్టుకు ఐపీఎల్ 2025 ప్రారంభం కాకముందే ఓ ఎదురుదెబ్బ తగిలింది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేటుకు పాల్పడడంతో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై ఓ మ్యాచ్ నిషేదం పడింది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆడే తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ముంబై తన తొలి మ్యాచ్‌ను మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు హార్దిక్ దూరం కానుండడంతో ఎవరు ముంబైని నడిపించనున్నారు అనే ఆసక్తి అందరిలో ఉంది.
IPL 2025 : సన్‌రైజర్స్ హైదారాబాద్ పూర్తి షెడ్యూల్.. మ్యాచ్‌లు, తేదీలు, సమయాలు, వేదికలు
పోటీలో ముగ్గురు..
ముంబై జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. అదే సమయంలో అనుభవం కలిగిన టీమ్ఇండియా కెప్టెన్లు ఆ జట్టులో ఉన్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రాలు ప్రధానంగా పోటీలో ఉన్నారు.
రోహిత్ శర్మ..
రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2013, 2015, 2017, 2019, 2020లలో ముంబై ఐపీఎల్ కప్పులను ముద్దాడింది. 158 మ్యాచ్‌ల్లో రోహిత్ నాయకత్వంలో ముంబై మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 87 మ్యాచ్‌ల్లో గెలువగా, 67 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. అయితే.. ఐపీఎల్ 2024 ముందు అనూహ్యంగా హిట్‌మ్యాన్‌ను ముంబై మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది.
హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఈ విషయం పై రోహిత్ శర్మ కాస్త అసంతృప్తితో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 ముగిసిన తరువాత రోహిత్ ముంబై జట్టును వీడనున్నాడనే రూమర్లు వచ్చాయి. అయితే.. రోహిత్ శర్మ మాత్రం ముంబైతోనే కొనసాగుతున్నాడు. మరి ఇంకోసారి అతడు ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడా? లేదా? అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.
సూర్యకుమార్ యాదవ్..
టీమ్ఇండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్సీ రేసులో బలమైన పోటీదారుడు. టీ20 ప్రపంచకప్ 2024 తరువాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకోగా అతడి స్థానాన్ని సూర్య భర్తీ చేశాడు. అతడి నాయకత్వంలో భారత్ 23 మ్యాచ్‌లు ఆడగా 18 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. అతడి విజయ శాతం 78.26 కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో హార్దిక్ గైర్హాజరీలో సూర్య ముంబై నాయకత్వ బాధ్యతలను చేపట్టే అవకాశాలను కొట్టిపారేయలేం.
జస్‌ప్రీత్ బుమ్రా..
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సైతం కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. అతడు ఐపీఎల్‌లో అతడికి కెప్టెన్సీ అనుభవం పరిమితంగా ఉన్నప్పటికి.. భారత టెస్టు కెప్టెన్‌గా అతడి కెప్టెన్సీ నాయకత్వ లక్షణాలు ఏంటో అందరికి తెలిసిందే. అయితే.. బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లను దూరం కానున్నాడని వార్తలు వస్తున్నాయి. ముంబై ఆడే తొలి నాలుగు మ్యాచ్‌ల్లో అతడు ఆడేది అనుమానంగా మారింది. ఈ క్రమంలో అతడు దాదాపుగా కెప్టెన్సీ రేసులో లేనట్లే. ఒకవేళ అతడు ఫిట్‌నెస్ సాధిస్తే మాత్రం అతడు నాయకత్వ రేసులో ఉంటాడు.