గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధం.. అభ్యర్థులకు కీలక సూచన చేసిన కమిషన్..
పరీక్షల నిర్వహణ కోసం అధికారులు తెలంగాణ వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Group 1 Mains Exams
Group 1 Mains Exams : భారీ గందరగోళం మధ్య రేపు(అక్టోబర్ 21) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరగబోతోంది. ఈ నెల 21 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం టీజీపీఎస్ సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న వేళ.. భారీ బందోబస్తు మధ్య గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని పోలీసులు ప్రకటించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పరీక్షల నిర్వహణ కోసం అధికారులు తెలంగాణ వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 563 పోస్టులకు 31వేల 382 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.
జూలైలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించిన కమిషన్.. గత నెలలో ఫలితాలు విడుదల చేసింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 29కి అనుగుణంగా ఎంపిక ప్రక్రియ చేపట్టడంతో మొత్తం 31వేల 382 మంది అభ్యర్థులు మెయిన్స్ కు ఎంపికయ్యారు. తమ అధికారిక వెబ్ సైట్ నుంచి హాట్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్ సీ అభ్యర్థులకు సూచించింది. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. రోజుకో హాల్ టికెట్ తో అభ్యర్థులు రావొద్దని చెప్పింది. తొలి రోజు ఎగ్జాజ్ సెంటర్ కు తీసుకెళ్లిన హాల్ టికెట్ నే మిగిలిన రోజులు కూడా తమ వెంట తీసుకురావాలని స్పష్టం చేసింది.
అటు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంటే.. ఇటు గ్రూప్ 1 అభ్యర్థులు చివరి ఆశగా తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి రేపు(అక్టోబర్ 21) విచారణ చేయబోతోంది. ఈ క్రమంలో మెయిన్స్ పరీక్షలు వాయిదా పడొచ్చని ఆలోచనలో ఉన్నారు. అటు రేపు మధ్యాహ్నం జరగనున్న పరీక్షకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. 2011 తర్వాత.. చాలా ఏళ్ల తర్వాత..గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
జీవో 29 కు సంబంధించి కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. జీవో 29 ను రద్దు చేయాలనే డిమాండ్ తో గ్రూప్ – 1 అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రులు కొంత తర్జనభర్జన చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తాము అని చెప్పిన పరిస్థితి ఉంది.
గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విద్యార్థులు రాజకీయ నాయకుల ట్రాప్ లో పడొద్దని సూచించారు. గత ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీపై చిత్తశుద్ది చూపలేదన్నారు. మీ అన్నగా నేను పరీక్షలు నిర్వహిస్తుంటే అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. పరీక్షలు ఆగవని ఆయన తేల్చి చెప్పారు. కాగా, కచ్చితంగా మెయిన్స్ పరీక్షలు కచ్చితంగా వాయిదా వేయాల్సిందేనని, జీవో నెంబర్ 29ను రద్దు చేయాల్సిందేని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : గ్రూప్-1 పరీక్షలు, జీవో 29పై సీఎం రేవంత్ కీలక ప్రకటన..