Alleti Maheshwar Reddy : అందుకే కాంగ్రెస్‌కి రాజీనామా, తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే-ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Alleti Maheshwar Reddy : బీఆర్ఎస్ ను గద్దె దించే శక్తి బీజేపీకే ఉంది. రేవంత్ రెడ్డి సొంత ఎజెండాతో పని చేస్తున్నారు.

Alleti Maheshwar Reddy
Alleti Maheshwar Reddy : అవమానాలు భరించలేకనే తాను కాంగ్రెస్‌కి రాజీనామా చేశానని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఏ కారణం లేకుండానే తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఆయన వాపోయారు. గంటలో ఎవరైనా నోటీసులకు రిప్లయ్ ఇవ్వగలరా? అని ఆయన ప్రశ్నించారు. నన్ను బయటకు పంపాలనే కుట్రలో భాగంగానే నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఏలేటి ఆరోపించారు.
ప్రాంతీయ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి అధ్యక్షుడై పార్టీలో ఉన్న సీనియర్లను వెళ్లగొడుతున్నాడని ఏలేటి అన్నారు. రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని లేఖ ఇచ్చింది నేనే అని చెప్పారు. రేవంత్ రెడ్డి సొంత ఎజెండాతో పని చేస్తున్నారని మండిపడ్డారు.
” మధ్యాహ్నం 12 వరకు వేచి చూశా ఖర్గే నుంచి పిలుపొస్తుందని. కానీ ఎలాంటి రిప్లయ్ రాలేదు. అవమానంతో కాంగ్రెస్ లో ఉండలేక బీజేపీలో చేరా. ప్రజా సమస్యలు, అవినీతి అంశాలపై కాంగ్రెస్ స్పందించడం లేదు. రానున్న రోజుల్లో కాంగ్రెస్.. బీఆర్ఎస్ పొత్తులో ఎన్నికలకు వెళ్లబోతుంది. బీఆర్ఎస్ ను గద్దె దించే శక్తి బీజేపీకే ఉంది. రానున్న రోజుల్లో బీజేపీలోకి ఇంకా చేరికలు ఉండబోతున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని” ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.