CM KCR : వాళ్లని గెలిపిస్తే మెడకు ఉరే, మీ భూములు గోవిందా- సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

CM KCR Fires On Congress : చెడ్డ ప్రభుత్వం వస్తే ఐదేళ్లు శిక్ష అనుభావించాల్సి వస్తుందని హెచ్చరించారు కేసీఆర్.

CM KCR : వాళ్లని గెలిపిస్తే మెడకు ఉరే, మీ భూములు గోవిందా- సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

CM KCR Fires On Congress (Photo : Facebook)

Updated On : November 26, 2023 / 9:29 PM IST

సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు కేసీఆర్. తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ అంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు మెడకు ఉరి తప్పదని హెచ్చరించారు.

ఎన్నికలు వస్తే ఆగం కావొద్దు..
పుట్టిన గడ్డ, చదువుకున్న గడ్డ కంటే ఏదీ గొప్పది కాదన్నారు కేసీఆర్. దుబ్బాకలో చదువుకున్నా, ఇక్కడి నుంచే సీఎంగా ఎదిగినా అని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నా, తగినంత పరిణతి రాలేదన్నారు. దుబ్బాక ప్రజలు ఎంతో చైతన్యవంతులు అన్న కేసీఆర్.. ఎన్నికలు వస్తే ఆగం కావద్దు అన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి వెనుకున్న పార్టీల చరిత్ర చూడాలన్నారు. ఎవరి చేతిలో తెలంగాణ సుభిక్షంగా ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు.

చెడ్డ ప్రభుత్వం వస్తే ఐదేళ్లు శిక్షే..
ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ అని ఫైర్ అయ్యారు కేసీఆర్. కాంగ్రెస్ నేతలే 58ఏళ్ల తెలంగాణ కష్టాలకు కారణం అని ఆరోపించారు. 1969లో 400 మంది ఉద్యమకారులను పిట్టలను కాల్చినట్లు కాల్చింది, ఎమర్జెన్సీ తెచ్చింది అని ధ్వజమెత్తారు. 15ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ప్రజల వద్ద ఉండే వజ్రాయుధం ఓటు అని, మన తలరాత మార్చేది ఆ ఓటే అని కేసీఆర్ అన్నారు. చెడ్డ ప్రభుత్వం వస్తే ఐదేళ్లు శిక్ష అనుభావించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Also Read : ఇంతవరకు గులాబీ జెండా ఎగరని గోశామహల్‌లో ఈసారి విజేత ఎవరు?

తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసింది..
”2014లో తెలంగాణ వచ్చాక ఎట్లా ఉండేదో మీకు తెలుసు. కరెంట్ లేదు, సాగునీరు లేదు, రైతుల ఆత్మహత్యలు.. అంతా గందరగోళంగా ఉండే. 2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మనతో కలిసి పోటీ చేసింది. ఇక్కడా, అక్కడా అధికారంలోకి వచ్చింది. అయినా తెలంగాణ ఇవ్వకుండా మళ్ళీ కాంగ్రెస్ దోకా చేసింది. కాంగ్రెస్ దోకా చేస్తే.. నాకు తిక్క రేగి కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని దీక్షకు దిగితే కేంద్రం దిగివచ్చింది. అయినా కాంగ్రెస్ ది మళ్ళీ అదే మోసం.

రైతులకు అంత డబ్బు ఎవరిస్తారు?
రైతుబంధు అనే పదాన్ని సృష్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రైతుబంధు దుబారా చేస్తున్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. 24 గంటల కరెంట్ అవసరం లేదు. 3 గంటలు చాలు అంటుండు రేవంత్ రెడ్డి. 10 హెచ్ పీ మోటార్లు పెట్టాలి అంటున్నాడు. 10 హెచ్ పీ మోటార్లు పెట్టుకుంటారా? అంత డబ్బు ఎవడివ్వాలి?

Also Read : ఆదిలాబాద్‌లో ఆసక్తికర రాజకీయం.. త్రిముఖ పోరులో గెలుపెవరిది?

కాంగ్రెస్ వస్తే రైతు మెడకు ఉరి తప్పదు..
కాంగ్రెస్ వస్తే రైతు మెడకు ఉరి తప్పదు. రైతుబంధు తీసేసి.. భూమాత పెడతరట.. అది భూమాతనా? భూమేతనా? మూడేళ్లు తల్లాడి ధరణి పోర్టల్ తెచ్చిన. ధరణిని తీసేసి బంగాళాఖాతంలో పడేస్తనంటున్నరు కాంగ్రెసోళ్లు. రాహుల్ గాంధీకి ఎద్దు ఏం తెలుసు? ధరణి తీసేస్తే రైతుబంధు ఎట్ల పడుతుంది? భూమాత తెచ్చి కౌలు రైతులకు రైతుబంధు ఇస్తరట. ఐదేళ్లు వాళ్ళు ఉంటే మీ భూములు గోవిందా. మన వేలుతో మన కళ్లే పొడుచుకుందామా..? ప్రభాకర్ రెడ్డి పదేళ్లుగా ఎంపీగా ఉన్నాడు. చీమకు కూడా హాని చేయడు.

అసైన్డ్ భూములు గుంజుకుంటామనడం పచ్చి అబద్దం..
ఉపఎన్నికలో నేను ప్రచారానికి రాలే. వస్తే ఈ కథే ఉండేది కాదు. ఏకాన పని చేయని మోసగాళ్ళు గెలిచారు. 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా తెలంగాణలో ఇయ్యలే. ప్రతి జిల్లాకు ఒక్క నవోదయ ఇవ్వాలి. ఒక్కటంటే ఒక్కటీ తెలంగాణకు ఇయ్యలే. వంద ఉత్తరాలు రాశా. ఒక్కటంటే ఒక్కటీ ఇయ్యని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి? అసైన్డ్ భూములు గుంజుకుంటామనడం పచ్చి అబద్దం. వారికి పట్టాలు ఇయ్యాలని నిర్ణయించాం. ప్రభాకర్ రెడ్డి గెలిచాక నెల రోజుల్లో రెవెన్యూ డివిజన్ తెచ్చుకుందాం. నెత్తి మీద కుండ లెక్క మల్లన్నసాగర్ ఉంది. దుబ్బాకకు లక్షకు పైగా ఎకరాల్లో సాగునీరు వస్తుంది” అని సీఎం కేసీఆర్ అన్నారు.