నాలుగు సార్లు నెగెటివ్, ఐదోసారి పాజిటివ్… కరోనాతో పోరాడి ఓడిన ఏఎస్సై దీనగాధ

కరోనా ఏ రూపంలో మనిషిని కబళిస్తుందో అర్ధం కాని పరిస్దితి ఏర్పడింది. ఏ లక్షణాలు లేని మనుషులకేమో పాజిటివ్ వస్తోంది. కరోనా లక్షణాలతో ఇబ్బంది పడేవారకేమో నెగెటివ్ వస్తోంది. దీంతో ప్రజలు భయ బ్రాంతులకు లోనవుతున్నారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చే సరికి ఒంటిని గుల్ల చేసి పారేస్తోంది కొందరిలో.
బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఏ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్ (55) కరోనా బారిన పడి గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ స్టేషన్ లో పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావటంతో ముందు జాగ్రత్త చర్యగా జులై7 వ తేదీన నేచర్ క్యూర్ హాస్పటల్ కు వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు నెగెటివ్ వచ్చింది.
అయితే కొంచెం శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటంతో ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళి చూపించుకున్నారు. అక్కడ సీటీ స్కాన్ చేసిన వైద్యులు ఊపిరి తిత్తులు దెబ్బతిన్నాయని చెప్పారు. దీంతో ఆ రిపోర్టు తీసుకుని నేచర్ క్యూర్ హాస్పటల్ కు వెళ్లగా ఇక్కడ ఆక్సిజన్ సౌకర్యం ఉండదు…గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
రిపోర్టులో నెగెటివ్ అని ఉండే సరికి గాంధీలో చేర్చుకోలేదు. చివరికి కింగ్ కోఠీ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స అందిస్తుండగా ఆక్సిజన్ మధ్యలో అయిపోయింది. దీంతో ఆదివారం జులై 12న రాత్రి సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా అక్కడతాత్కాలికంగా ఆక్సిజన్ అందించారే తప్ప ఇన్ పేషెంట్ గా చేర్చుకోలేదు.
అక్కడి నుంచి మళ్లీ అర్ధరాత్రి సమయంలో గాంధీ కి తీసుకు వెళ్ళారు కుటుంబ సభ్యులు. అప్పటికే పల్స్ తక్కువగా ఉండటంతో గాంధీలో చేర్చుకుని చికిత్స అందించటం మొదలెట్టారు. ఈ లోగా కుటుంబ సభ్యులు పోలీసు అధికారులను సంప్రదించారు. వారి సూచనలతో ప్రేమ్ కుమార్ ను సోమవారం అపోలో ఆస్పత్రికి తరలించారు.
అక్కడి రెండు సార్లు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. బుధవారం మరో సారి పరీక్ష నిర్వహించారు. గురువారం ఆ ఫలితం పాజిటివ్ వచ్చింది. అప్పటికే వెంటిలేటర్ పై చికత్స పొందుతున్న ప్రేమ్ కుమార్ గురువారం రాత్రి మృతి చెందారు. మొదట్లోనే ఎన్ని ఆస్పత్రులు తిరిగినా చేర్చుకోకపోవటంతో ప్రాణాపాయం ఏర్పడిందని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.