రేవంత్‌కు గండం..? సీఎం రేసులో ఆ ముగ్గురు మంత్రులు ఉన్నారు- బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సీఎం అవ్వాలని పోటీ పడుతున్న ముగ్గురు మంత్రులు.. తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Alleti Maheshwar Reddy (Photo Credit : Facebook)
Alleti Maheshwar Reddy : రేవంత్ సర్కార్ పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 2025 డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త సీఎం రాబోతున్నారని వ్యాఖ్యానించారు. సీఎం రేసులో ముగ్గురు మంత్రులు ఉన్నారని, వారిలో ఎవరైనా సీఎం కావొచ్చన్నారు. గత 7 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఏడుసార్లు వెళ్లినా.. రాహుల్ గాంధీ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రేవంత్ రెడ్డి సీఎం పదవికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది అంటూ కూడా అధిష్టానం భావిస్తోందని, ఇక నుంచి ఆయన చేసే ప్రతి పనిపైన ఇప్పటికే దృష్టి సారించింది అని మహేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం అవ్వాలని పోటీ పడుతున్న ముగ్గురు మంత్రులు.. తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల ప్రియాంక గాంధీ నామినేషన్ కు వెళితే కనీసం అక్కడైనా రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ దొరుకుతుందని భావించారని, కానీ, అక్కడ కూడా రేవంత్ కు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. గత 10 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనులే ఇందుకు కారణం అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
మూసీ ప్రక్షాళనను సీఎం రేవంత్ తన సొంతానికి వాడుకుంటున్నారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి వెళ్లడంతోనే.. రేవంత్ పైన అధిష్టానం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి తోడు పార్టీ ఫిరాయింపులపై హైకమాండ్ కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి తీరు ఉందని ఆయన అన్నారు.
మొదటి నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సహజ రాజకీయాలు చేస్తున్నారని, ఎవరికి వారు ఈ మెయిల్స్ ద్వారా చెప్పడం, నేరుగా వెళ్లి చెప్పడం..ఇలా రేవంత్ పై ఫిర్యాదులు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు అనే విషయం ఇప్పటివరకు జనాలు, మంత్రుల వద్దనే ఉండేదని, ఇప్పుడా విషయం కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా తెలిసిందని, మంత్రులు సైతం రెండు వర్గాలుగా విడిపోయారని, సీఎం పోస్ట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కొంతమంది రేవంత్ రెడ్డికి మద్దతుగా చేస్తున్నారని, మరికొందరు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. కాంగ్రెస్ మంత్రులే కాకుండా.. కేవీపీ రామచంద్రరావు, పల్లం రాజు వంటి వాళ్లు సోనియా గాంధీ దృష్టికి సీఎం రేవంత్ అంశాలను తీసుకెళ్లినట్లుగా మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
Also Read : టీటీడీపీపై దృష్టి సారించిన చంద్రబాబు.. టీటీడీపీ అధ్యక్షుడిగా బాబూమోహన్?