అన్న ఆధిపత్యాన్ని సవాల్ చేయడం కోసమే కవిత లేఖ.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్

తెలంగాణ రాజకీయాల్లో కవిత ప్రభావం ఏమాత్రం ఉండదు. అవినీతిలో, కుంభకోణంలో కూరుకుపోయిన వ్యక్తి కవిత..

అన్న ఆధిపత్యాన్ని సవాల్ చేయడం కోసమే కవిత లేఖ.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman

Updated On : May 25, 2025 / 2:32 PM IST

MP Laxman: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పగ్గాలు కేటీఆర్ కి ఇస్తారని భావించి కేటీఆర్ నాయకత్వాన్ని కవిత వ్యతిరేకిస్తున్నారని, అన్న ఆధిపత్యాన్ని సవాల్ చేయడం కోసమే కవిత లేఖ రాసినట్లు ఉందని లక్షణ్ అన్నారు.

 

అన్నలు వదిలిన బాణాలు ఇప్పుడు అన్నలపై గురిపెడుతున్నారు. ఏపీలో జగన్ పై షర్మిల, తెలంగాణలో కేటీఆర్ పై కవిత బాణాలు సంధిస్తున్నారు. ఆస్తులు, అధికారం అన్నలకు వర్తిస్తున్నాయని, తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రజా ప్రయోజనాలకన్నా సొంత ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం రచ్చ కెక్కుతున్నారని లక్ష్మణ్ అన్నారు.

 

ఆస్తుల గొడవా.. అధికారం గొడవా అనేది ప్రజలకు అర్థం కావడం లేదు. ఏపిలో కాంగ్రెస్ షర్మిలను పావుగా వాడుకుంది.. ఇప్పుడు తెలంగాణలో కవితని కాంగ్రెస్ పావుగా వాడుకుంటుందన్న ప్రచారం ఉంది. దేశంలో కాంగ్రెస్ బలహీన పడుతుంది.. బీజేపీ వెలిగిపోతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కవితతో కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామంటూనే కేటీఆర్ ను సవాల్ చేసేలా లేఖాస్త్రం ప్రయోగించారు. అన్న ఆధిపత్యాన్ని సవాల్ చేయడం కోసమే కవిత లేఖ రాసినట్లు ఉంది. అయినా.. కేసీఆర్ కు కవిత రాసిన లేఖ మూడో వ్యక్తి ద్వారా ఎలా బహిర్గతం అవుతుందని లక్ష్మణ్ అన్నారు.

 

కవిత సామాజిక న్యాయం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. 10ఏళ్లు అధికారంలో ఉన్నపుడు సామాజిక న్యాయం గురించి కవిత మాట్లాడలేదు. రాజకీయ అవసరాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను వాడుకోవాలని చూస్తున్నారు. కానీ, కవిత కుట్రలు పనిచేయవు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవడం ఖాయమని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో కవిత ప్రభావం ఏమాత్రం ఉండదు. అవినీతిలో, కుంభకోణంలో కూరుకుపోయిన వ్యక్తి కవిత. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మహాత్మ జ్యోతిభాపూలె విగ్రహం విషయం ఎందుకు గుర్తుకు రాలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. వారసత్వం అనేది కుటుంబం నుంచే రావాలా..? బీఆర్ఎస్ లో మిగిలిన వ్యక్తులు అర్హులు కాదా..? అధికారంలో ఉన్నప్పుడు ఆస్తులు, పదువులు పంచుకున్నారు అంటూ లక్ష్మణ్ విమర్శించారు.