KCR Action Plan : రంగంలోకి కేసీఆర్! గేర్ మార్చనున్న గులాబీ పార్టీ .. ఇక సమరమే..!
KCR Action Plan : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు సిద్దమవుతున్నట్టుగా ..
BRS Chief KCR
KCR Action Plan : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 19న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగే బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సంయుక్త సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్గాలు వివరాలు వెల్లడించాయి.
Also Read: Ration Card : రేషన్ కార్డు దారులకు బిగ్ షాకింగ్ న్యూస్.. అలా చేయకుంటే రేషన్ కట్..! హెచ్చరికలు జారీ..
అయితే కేసీఆర్ గత కొంతకాలంగా పార్టీ ముఖ్య నాయకులకు అందుబాటులో ఉండటంతో పాటు.. నియోజకవర్గాల వారీగా తనను కలిసేందుకు వచ్చిన కొందరు నేతలతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. తాజాగా ఇప్పుడు ‘‘కారు’’ గేర్ మార్చాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చించాలని కేసీఆర్ నిర్ణయించారని.. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్‌లొ ఈ నెల 19న బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సంయుక్త సమావేశం ఏర్పాటు చేసిందని గులాబీ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి కృష్ణ జలాలను కొల్లగొడుతున్నా కూడా, దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఇటువంటి సందర్భంలో.. తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చ జరగనుందని సమాచారం.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 90 టీఎంసీలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలు అని కేంద్రం ముందు మోకరిళ్లడం బాధాకరమని బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా, గోదావరి జలాల దోపిడీని రేవంత్ సర్కార్ అడ్డుకోవడం లేదని కేసీఆర్ మండిపడుతున్నారు. కేంద్రం దగ్గర మోకరిళ్లడం రైతుల ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని.. అయినా, రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ.. ఒక్కరు కూడా నోరు మెదపడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో బీఆర్ఎస్ ఎప్పటికీ రాజీపడదని, కేంద్రంకు వ్యతిరేకంగా మరోసారి ప్రత్యక్ష పోరాటం తప్పదని కేసీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ వార్నింగ్‌కు తగ్గట్టుగానే ఇప్పుడు నేరుగా ఆయన రంగంలోకి దిగుతుండటంతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ హీటెక్కనున్నాయి.
