మేడిగడ్డ వెళ్తున్న సీఎం రేవంత్, మంత్రులకు కీలక సూచన చేసిన హరీశ్ రావు.. అదేమిటంటే?
కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎందుకు ప్రాణహిత చేవెళ్ల కట్టలేదని హరీష్ రావు ప్రశ్నించారు.

BRS MLA Harish Rao
BRS Leader Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. శాసనసభ జరిగిన, జరుగుతున్న తీరును ఖండిస్తున్నామని అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల తరువాత ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. మీరు మాట్లాడి మాకు మైకులు ఇవ్వకపోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం అన్నారు. ప్రజాస్వామ్య విలువలు మంట గలిపే విధంగా ప్రభుత్వం తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదు.. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్ లు. 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్. 240 టీఎంసీల ఉపయోగం. వీటన్నింటి సమాహారం కాళేశ్వరం అని హరీష్ రావు అన్నారు.
Also Read : బీఆర్ఎస్‌కు మరో బిగ్‌షాక్.. సీఎం రేవంత్‌ను కలిసిన గ్రేటర్ డిప్యూటీ మేయర్ దంపతులు
ఒక బ్యారేజ్ లో ఒకటిరెండు కుంగిపోతే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని కాంగ్రెస్ నేతల తీరుపై విమర్శలు గుప్పించారు. మీరు వెళ్లే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడండి.. కాళేశ్వరం ఫలితాలు రైతులను అడగండి అంటూ హరీష్ రావు సీఎం రేవంత్, మంత్రులకు సలహా ఇచ్చారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి రంగనాయక సాగర్ చూశారు. అద్భుతం అని మెచ్చుకున్నారని హరీష్ రావు అన్నారు. చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాంతంలో ప్రాణహిత కట్టాలని చూస్తే అనేక అడ్డంకులు సృష్టించారు. కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎందుకు ప్రాణహిత చేవెళ్ల కట్టలేదని హరీష్ రావు ప్రశ్నించారు. మేము నీళ్లులేని దగ్గర నుండి నీళ్లున్న దగ్గరకు మార్చి ప్రాజెక్టు కట్టి నీళ్లు అందిస్తున్నామని చెప్పారు.
మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే ఆ జలాల వల్లేనని హరీష్ రావు అన్నారు. తప్పు జరిగితే చర్య తీసుకోండి.. పునరుద్దరణ పనులు చేయండి.. దురుద్దేశంతో కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు పునరుద్దరణ చేయడం లేదని అన్నారు. అద్భుతంగా నిర్మించి నీళ్లు ఇస్తున్నాం. రైతులను ఇబ్బంది పెట్టకండి, నష్టపోతారు.. ప్రజలు మిమ్మల్ని క్షమించరు అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్ట ప్లే ఓవర్ కూలి 20 మంది చనిపోయారు. దేవాదుల పైపులు పేలి నీళ్లు ఆకాశమంత ఎగిరాయి. అలాంటి ఘటనలు జరగడం బాధాకరం. కానీ, ముందుకెళ్లాం కదా. ప్రాజెక్టులు అప్పగించవద్దని మేము నిద్రలేపితే కాంగ్రెస్ ప్రభుత్వం లేచింది. ఈరోజు మా సభ ఉందని మీరు డైవర్ట్ కోసం పోటీ కార్యక్రమం పెట్టారు. మీ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.