సెంటిమెంట్‌గా కరీంనగర్ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న గులాబీ బాస్.. సభకు లక్ష మంది

BRS: రాజకీయంగా అండగా నిలవడమే కాదు... తెలంగాణ మలిదశ ఉద్యమానికి కరీంనగర్ ఊపిరి పోసింది. అందుకే..

సెంటిమెంట్‌గా కరీంనగర్ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న గులాబీ బాస్.. సభకు లక్ష మంది

kcr

ఎటు చూసినా తోరణాలు, జెండాలతో.. కరీంనగర్ గులాబీమయమైంది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే కదనభేరి సభకు సర్వం సిద్ధమైంది. సభకు లక్ష మందిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గులాబీ లీడర్లు. సెంటిమెంట్‌గా భావించే కరీంనగర్ నుంచి..పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు గులాబీ బాస్ కేసీఆర్.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న తొలి ఎన్నికల సభ కావడంతో… భారీ జనసమీకరణపై దృష్టిపెట్టాయి పార్టీ శ్రేణులు. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ చరిష్మా…కేసీఆర్ ఇమేజ్ తగ్గలేదని నిరూపించేందుకు కదనభేరి సభతో నిరూపించుకోవాలని చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇందుకోసం కరీంనగర్ లో జరిగే సభకు లక్ష మంది హజరయ్యేలా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలోని నియెజకవర్గాల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ.. క్యాడర్ లో జోష్ నింపుతున్నారు.

కేసీఆర్ ప్రసంగం
నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగసభలో పెద్దగా రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు గులాబీ బాస్. కేవలం కృష్ణాప్రాజెక్టుల అంశం వరకే పరిమితమయ్యారు. కానీ కరీంనగర్ కదనభేరి ఎన్నికల ప్రచారసభ కావడంతో.. మీటింగ్ లో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుందనే దానిపైనే చర్చ సాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ పై ఎలాంటి విమర్శనాస్త్రాలను సంధిస్తారో అనేది ఆసక్తిగా మారింది.

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌కు.. కరీంనగర్ ఓ సెంటిమెంట్‌గా కొనసాగుతోంది. సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికవుతూ వచ్చిన కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ప్రత్యేక రాష్ట్ర విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన తొలిసారి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి కరీంనగర్ లోక్‌సభను ఎంచుకున్నారు. అక్కడి నుంచి 2004లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ కోసం రెండుసార్లు రాజీనామా చేసి ఉపఎన్నికలో కరీంనగర్ నుంచే గెలిచారు. కరీంనగర్ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని..బహిరంగ సభల్లో ప్రస్తావిస్తుంటారు కేసీఆర్.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో..
రాజకీయంగా అండగా నిలవడమే కాదు…తెలంగాణ మలిదశ ఉద్యమానికి కరీంనగర్ ఊపిరి పోసింది. అందుకే కేసీఆర్ కు కరీంనగర్ ఓ సెంటిమెంట్‌గా మారింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యంలో గులాబీ జెండా ఎగురవేసిన కేసీఆర్‌, ఆ తర్వాత సరిగ్గా 20 రోజులకు, 2001 మే 17న కరీంనగర్‌లో సింహగర్జన సభ నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మొట్టమొదటిదైన ఆ బహిరంగసభకు లక్షలాదిగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు.

ఆ తర్వాత తెలంగాణ కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షకు కరీంనగర్ నుంచే బయలుదేరివెళ్లారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ 10ఏళ్లలో అనేక సంక్షేమ పథాకాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికైంది. 2014, 2018 ఎన్నికల సమరభేరిని సైతం కరీంనగర్ నుంచే మోగించిన కేసీఆర్..మరోసారి కరీంనగర్ వేదికగా కదనభేరి బహిరంగ సభతో పార్లమెంట్ ఎన్నికల శంఖరావాన్ని పూరించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని..జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది.

Also Read : కారులో కలకలం.. బీఆర్ఎస్‌‌లో వలసలకు కారణం ఏంటి?