బీఆర్ఎస్ అలర్ట్.. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య?

కడియం కావ్య అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. తమ పార్టీ తరపున సీనియర్ నాయకుడు రాజయ్యను బరిలోకి దింపేందుకు రెడీ అవుతోంది.

బీఆర్ఎస్ అలర్ట్.. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య?

Thatikonda Rajaiah: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు తాజాగా తెరపైకి వచ్చింది. కడియం కావ్య ఎన్నికల్లో పోటికి నిరాకరించి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైన నేపథ్యంలో రాజయ్యను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయనతో బీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రాజయ్య అంటున్నారు. నియోజకవర్గ కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ముందుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ టికెట్ ఆశించి భంగపడటంతో ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. అయితే వేరే ఏ పార్టీలోనూ చేరకపోవడంతో వరంగల్ ఎంపీ ఎన్నికల్లో ఆయనను పోటీచేయిందుకు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మంతనాలు సాగిస్తున్నారు. రాజయ్య కూడా పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆయన భేటీ అవుతారని సమాచారం. తన నిర్ణయాన్ని కేసీఆర్‌కు తెలియజేసే అవకాశముందని తెలుస్తోంది.

Also Read: సహకరించే నాయకులు లేక అయోమయంలో ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి

కాగా, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఖరారైన కడియం శ్రీహరి కుమార్తె కావ్య పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో వరంగల్ రాజకీయాలు హీటెక్కాయి. తండ్రితో పాటు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నుంచి ఆమెకు టికెట్ ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుడైన రాజయ్య పేరును బీఆర్ఎస్ తెరపైకి తెచ్చింది. చాలా కాలంగా కడియం శ్రీహరి, రాజయ్య మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకవేళ కడియం శ్రీహరి కుమార్తెకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే.. రాజయ్యే సరైన ప్రత్యర్థి అవుతారని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ జిల్లా నేతలు రాజయ్య వైపు మొగ్గు చూపిస్తున్నట్టు సమాచారం.