Chevella Road Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం..
Chevella road accident : చేవెళ్ల మండలం మీర్జాగూడ జరిగిన బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 24మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు
Chevella road accident
Chevella Road Accident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనంలో డ్రైవర్ల వైపు బస్సు, లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. అయితే, ప్రమాదం సమయంలో టిప్పర్ లారీ ట్రక్కులో నిండుగా కంకర ఉండటంతో ఆ కంకర మొత్తం బస్సు ముందుభాగంలో కూర్చుకున్న ప్రయాణికులపై పడింది. ఈ ఘటనలో బస్సు, లారీ డ్రైవర్ సహా పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించారు. అయితే, మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఈ బస్సు ప్రమాదంలో 19మంది చనిపోయినట్లు ఆయన వెళ్లడించారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేవెళ్ల ప్రభుత్వం ఆస్పత్రిలో జరుగుతోందని తెలిపారు. మృతుల్లో 10 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు, ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే, 19 మృతదేహాల్లో 13 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారని పొన్నం చెప్పారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 5లక్షలు, క్షతగాత్రులకు రూ. 2లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందజేస్తామని అన్నారు.
ఘటనపై విచారణకు ఆదేశించామని.. ఈ విషయంలో రాజకీయాలు సరికాదు.. రాజకీయాలు చేయొద్దని పొన్నం సూచించారు. రోడ్డు ఎందుకు లేట్ అయింది? ఎప్పుడు శాంక్షన్ అయింది? ఎవరు కేసు వేశారు? ఇవన్నీ బయటకు వస్తాయి? టిప్పర్ ఎదురుగా వచ్చి ఢీకుంటే ఆర్టీసీ బస్సుదే తప్పా..? అంటూ పొన్నం ప్రశ్నించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించి సమీక్షిస్తామని, మృతదేహాలను వారి కుటుంబాలకు అందజేస్తామని మంత్రి చెప్పారు.
