శివుడు తలమీద గంగను మీరే భూమ్మీదకు తెచ్చినట్లు చెబుతున్నారు : హరీశ్ రావుకు సీఎం రేవంత్ కౌంటర్
బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు తెలంగాణలో ఎవ్వరు నీళ్లు తాగలేదా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు.

CM Revanth Reddy Vs Harish Rao : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక అరాచకాలు జరిగాయని.. కాళేశ్వరం ప్రాజెక్టు వంటి నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. 42 పేజీల శ్వేతపత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై జరిగిన చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పాలనపై తనదైన శైలిలో పంచ్ లు వేశారు.
మిషన్ భగీరథ పేరుతో తమ ప్రభుత్వం ఇంటింటికి నల్లాలు ఇచ్చిందని, తాగునీటిని ఇంటికే తీసుకొచ్చామని గొప్పలు చెబుతోందని.. కానీ 2014 కంటే ముందు తెలంగాణలో ఎవ్వరు మంచినీళ్లు తాగలేదా..? పంటలు పండించుకోలేదా..? గ్రామాల్లో వాటర్ ట్యాంకులు లేవా..? నల్లాలు లేవా..? ఎవ్వరు మంచినీళ్లు తాగలేదా..? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే అందరు నీళ్లు తాగుతున్నారా..? అంటూ సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వమే తాగునీరు, సాగునీరు ఇచ్చామని వాళ్లే ఏదో.. కైలాసంలో ఉన్న పరమశివుడు తలమీదున్న గంగమ్మను భూమ్మీదకు తెచ్చి.. ఆ గంగను కాళేశ్వరం ప్రాజెక్టులోకి పారించి ఆ నీటిని మన ఇళ్లల్లో నల్లాల్లోకి తెచ్చామని చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. వీళ్లు ఇచ్చిన నీళ్లతోనే తెలంగాణ ప్రజల జీవితాలు ధన్యమైనట్లు చెబుతున్నారు అంటూ సెటైర్లు వేశారు.
Also Read: అసెంబ్లీలో 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం.. తెలంగాణ అప్పులు ఎన్నంటే?
ఈ అద్భుతాలన్నీ వీళ్లే చేసినట్లుగా చెబుతున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి.. హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి మాటలతో ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే యత్నాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. రాజకీయ సభల్లో ఎన్నైనా మాట్లాడుకోవచ్చు.. కానీ అసెంబ్లీ సభలో ప్రజల సమస్యల గురించి చర్చించకుండా జరిగిదానికి గురించి మాట్లాడకుండా.. సభను తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ విమర్శించారు.