CM Revanth Reddy: ఇలాంటి వారు పదవుల సంగతి మరచిపోండి: రేవంత్ రెడ్డి వార్నింగ్
హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో యువజన కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Cm Revanth Reddy
కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందని, అంతేగానీ, దండం పెట్టి దండాలు పెడితే పదవులు రావని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి వారు పదవుల సంగతి మరచిపోండని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో యువజన కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
“ఢిల్లీ నుంచి పైరవీలతో కాదు… గల్లీలో పేదల కోసం పనిచేసే వారినే పదవులు వరిస్తాయి. డబ్బులతో ఎన్నికల్లో గెలిచే రోజులు పోయాయి… నిత్యం ప్రజల్లో ఉండే వారినే గెలుపు వరిస్తుంది. యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన చాలామంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో రాణించారు. రాజకీయాల్లో యువజన కాంగ్రెస్ మొదటి మెట్టు.
ప్రజల వద్దకు వెళ్లి పేదల కోసం పనిచేస్తేనే రాజకీయాల్లో రాణిస్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలా జెండాను మోసి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం.
ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత యూత్ కాంగ్రెస్ పై ఉంది. పార్టీ అనుబంధ విభాగాల్లో బాధ్యత తీసుకున్న వారికి ప్రభుత్వంలో స్థానం కలిపిస్తామని ఆనాడు చెప్పాం. 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులను అనుబంధ విభాగాలకు అందించాం.
గట్టిగా కొడతానని అంటున్న కెసిఆర్ కు ఈవేదికగా చెబుతున్నా… గట్టిగా కొట్టాలంటే దుర్మార్గంగా ప్రజలను దోచుకున్న నీ కొడుకును, అల్లుడిని, బిడ్డను కొట్టు. ఇగ ఆయన బయటకు వస్తానని చెప్పుకుంటుండు.. బయటకు వచ్చి ఏం చేస్తాడు? నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టారు… మళ్లీ బయటకు వచ్చి చేసేదేముంది?
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. రైతులకు రుణమాఫీ చేశాం…నీవు ఎగ్గొట్టిన రైతు బంధు మేం వేశాం. దేశంలో కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.
మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు కోసం నిర్ణయం తీసుకున్న రాష్ట్రం తెలంగాణ. మోదీ మందకృష్ణను ఎన్నోసార్లు కౌగిలించుకున్నారు… అది ధృతరాష్ట్ర కౌగిలిగానే మిగిలింది తప్ప వర్గీకరణ అమలు చేయలేదు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై బీఆరెస్ దుష్ప్రచారం చేస్తోంది” అని రేవంత్ రెడ్డి అన్నారు.