Medaram Jatara: కుంభమేళా స్థాయిలో మేడారం జాతర, జంపన్న వాగులో నిరంతరం నీరు పారిస్తాం- సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఇది నాకు దక్కిన అరుదైన అవకాశం అని అన్నారు. మేడారం అభివృద్ధి చేసి మొక్కు తీర్చుకున్నా.
Medaram Jatara Cm Revanth Representative Image (Image Credit To Original Source)
- ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం
- మేడారం అభివృద్ధి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా
- రామప్ప, లక్నవరం నుంచి జంపన్న వాగుకు నీరు తరలిస్తాం
Medaram Jatara: ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర. ఈ నెల 28 నుంచి 31 వ తేదీ వరకు నాలుగు రోజులు అంగరంగ వైభవంగా జాతర జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు జాతరకు వస్తారు.
మేడారం జాతర నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేడారం జాతరను కుంభమేళా స్థాయిలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. జీవితంలో ఏం చేశామని వెనక్కి తిరిగి చూసుకుంటే గిరిజనుల కోసం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేశామని గర్వంగా చెప్పుకుంటానన్నారు. ఇక,
చరిత్రలో హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవని రేవంత్ అన్నారు. ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం అని అభివర్ణించారు. గుడి లేని తల్లులను గుండె నిండా కొలుచుకునే తెలంగాణ అతి పెద్ద గిరిజన జాతర మేడారం జాతర అని చెప్పారు.
కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన ధీర వనితలు సమ్మక్క-సారలమ్మలు అని తెలిపారు. మేడారం జాతరను దక్షిణాది కుంభమేళాగా పేర్కొన్నారు. ఆనాడు ఫిబ్రవరి 6, 2023న ప్రజా కంఠక పాలనను గద్దె దించాలని ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించానని రేవంత్ గుర్తు చేశారు. తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. మేడారం అభివృద్ధి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. 100 రోజుల్లో రాతి కట్టడాలతో తల్లుల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించానని వెల్లడించారు.
జాతర నాటికి మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. ఇది నాకు దక్కిన అరుదైన అవకాశం అని అన్నారు. మేడారం అభివృద్ధి చేసి.. ఫిబ్రవరి 6, 2023 న మొక్కుకున్న మొక్కు తీర్చుకున్నామన్నారు. మేడారం జంపన్న వాగులో నిరంతరం నీరు పారిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. రామప్ప, లక్నవరం నుంచి జంపన్న వాగుకు నీరు తరలిస్తామన్నారు. రేపు ఉదయం సమ్మక్క- సారలక్క ఆలయాయాన్ని ప్రారంభించుకుని భక్తులకు అంకితం చేస్తామన్నారు.
